Renewable Energy Job Opportunities In India: భారత పునరుత్పాదక విద్యుత్ రంగానికి 2030 కల్లా సుమారు 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యం ఉందని ఓ నివేదిక తెలిపింది. ఇందులో చాలావరకు కొత్త ఉద్యోగాలు, చిన్న తరహా పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచే వస్తాయని పేర్కొంది. ప్రస్తుతం దేశీయ పునరుత్పాదక విద్యుత్ రంగంలో 1.1 లక్షల మంది పనిచేస్తున్నారని అంచనా. 2030 నాటికి ఈ రంగం సృష్టించే ఉద్యోగాలు ఈ సంఖ్యకు పది రెట్లు అవుతాయని కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ (సీఈఈడబ్ల్యూ), నేచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌనిల్స్ (ఎన్‌ఆర్‌డీసీ), స్కిల్ కౌన్సిల్ ఫర్ గ్రీన్ జాబ్స్ (ఎస్‌సీజీజే) రూపొందించిన నివేదిక పేర్కొంది. సోలార్ పార్క్‌లు లాంటి పెద్ద ప్రాజెక్టులతో పోలిస్తే భవనాల పైకప్పులపై ఏర్పాటు చేసే చిన్న చిన్న సౌరవిద్యుత్తు పనులు, మినీ, మైక్రో- గ్రిడ్ సిస్టమ్స్ లాంటి చిన్న తరహా పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నుంచే కొత్త ఉద్యోగాల్లో చాలా వరకు వస్తాయని తెలిపింది. ఈ తరహా పథకాల అమలు, అవసరమైన పరికరాల తయారీని పెంచేందుకు రాబోయే బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఈఈడబ్ల్యూ సీఈఓ అరుణభా ఘోష్ తెలిపారు.
కొవిడ్ ప్రభావం
Covid Impact on Renewable Energy: పునరుత్పాదక విద్యుత్ రంగంలో ఉద్యోగకల్పనపైనా కొవిడ్-19 పరిణామాలు ప్రతికూల ప్రభావం చూపాయని నివేదిక వివరించింది. 2018-19లో ఈ రంగం 12,400 కొత్త ఉద్యోగాలను సృష్టించింది. అయితే 2019-20లో 5,200 మందికి, 2020-21లో 6,400 మందికి మాత్రమే ఈ రంగం ద్వారా కొత్త ఉద్యోగావకాశాలు లభించాయి. స్వచ్ఛ ఇంధన ప్రాజెక్టుల్లో నైపుణ్య ఉద్యోగుల సంఖ్యను పెంచేందుకు 2015, 2017 మధ్య సూర్యమిత్ర శిక్షణ కార్యక్రమం కింద 78,000 మందికి భారత్ శిక్షణ ఇచ్చిన విషయాన్ని నివేదిక ప్రస్తావించింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: 'కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుందాం'