సెకన్ల వ్యవధిలోనే కొవిడ్-19 బాధితులు, లక్షణాలు లేకుండా వ్యాధిని వ్యాప్తి చేసేవారిని గుర్తించేందుకు అవసరమైన పరికరాల ఏర్పాటు, వాటిని వినియోగించే శిక్షణ కోసం ఇజ్రాయెల్ నిపుణుల బృందం భారత్కు వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ విజ్ఞప్తి చేసింది. ఈ సాంకేతికతను ఇజ్రాయెల్ అంకుర సంస్థ నుంచి రిలయన్స్ 15 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. రిలయన్స్ విజ్ఞప్తి చేసిన తర్వాత బ్రెత్ ఆఫ్ హెల్త్(ఓఓ హెచ్) బృందానికి అత్యవసర అనుమతి లభించిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో భారత్ సహా ఏడు దేశాలకు పౌరులు వెళ్లకుండా ఇజ్రాయెల్ తాత్కాలిక నిషేధం విధించడం వల్ల ప్రత్యేక అనుమతి అవసరమైంది. కరోనా రోగులను శరవేగంగా గుర్తించేందుకు అభివృద్ధి చేసిన ఈ వినూత్న వ్యవస్థ నిర్వహణకు భారత్లో రిలయన్స్ బృందానికి ఇజ్రాయెల్ నిపుణులు సాయం చేయనున్నారు. ఈ ఒప్పందం కింద శ్వాసను పరీక్షించే వందల కొద్దీ వ్యవస్థలను రిలయన్స్ భారత్ లో ఏర్పాటు చేస్తుంది. నెలకు కోటి డాలర్లు (సుమారు రూ.75 కోట్లు) వెచ్చించి, లక్షల కొద్దీ పరీక్షలను నిర్వహించే వీలుంటుంది. ఈ పరీక్షల కచ్చితత్వం 95 శాతంగా బీఓహెచ్ ప్రకటించింది.
ఇదీ చూడండి: రియల్మీ సీ11 నయా వెర్షన్- ఫీచర్స్ ఇవే...