భారత రిటైల్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అమెజాన్‌తో నిన్నమొన్నటిదాకా పోటీ పడుతున్న రిలయన్స్ రిటైల్ ఇపుడు స్నేహ హస్తం చాచేలా కనిపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిటైల్ వ్యాపారంలో ఏకంగా 20 బిలియన్ డాలర్ల (రూ.1.5 లక్షల కోట్లు) వాటాను విక్రయించే యోచనలో ఉందని ఈ అంశాలతో సంబంధమున్న ఒక వ్యక్తి 'బ్లూమ్‌బర్గ్'కు తెలిపారు. రిలయన్స్ రిటైల్‌తో అమెజాన్ తన పెట్టుబడుల విషయమై చర్చలు జరుపుతున్నట్లు.. ఒప్పందానికి అమితాసక్తితో ఉన్నట్లు ఆ వ్యక్తి వివరించారు. రిలయన్స్ కూడా తన అనుబంధ కంపెనీలో 40 శాతం వాటాను అమ్మడానికి సిద్ధంగానే ఉన్నట్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఆ వ్యక్తి సమాచారం ఇచ్చారు.
ఒప్పందం జరిగితే..
విశ్వసనీయ వర్గాలు చెబుతున్నట్లుగా ఈ ఒప్పందం జరిగితే మాత్రం భారత దేశ రిటైల్ రంగంలోనే అతిపెద్ద రిటైల్ కంపెనీ (అటు ఆఫ్‌లైన్, ఇటు ఆన్‌లైన్‌లో) అవతరిస్తుంది. అంతే కాదు ఇన్నాళ్లూ పోటీపరంగా శత్రువులుగా ఉంటున్న జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీలు మిత్రులు అవతారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న వినియోగ మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్‌లో వీరు ఇరువురు కలిస్తే పెద్ద మార్పులే చోటు చేసుకోవచ్చు. 20 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,50,000 కోట్లు) ఒప్పందం ఇప్పటిదాకా భారత్‌లోనే అతిపెద్దది. అమెజాన్‌కు కూడా ఇదే అత్యంత భారీ లావాదేవీ కానుందని బ్లూమ్ బర్గ్ చెబుతోంది.
అమెజాన్‌కు ఎందుకు ఆసక్తి
ఇ-కామర్స్‌లో అమెజాన్ వేగంగా విస్తరిస్తున్నా భారత్ వంటి దేశాల్లో పచారీ కొట్లు, వీధి చివరి అంగళ్లదే హవా. లక్ష కోట్ల డాలర్ల భారత రిటైల్ మార్కెట్లో ఆన్‌లైన్ కొనుగోళ్ల వాటా చాలా తక్కువే. అందుకే క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్న భాగస్వామి కోసం చూస్తోంది. రిలయన్స్ రిటైల్ అందుకు సరిగ్గా సరిపోతుంది. అలాగే అమెజాన్‌కు ఉన్న గిడ్డంగుల సామర్థ్యం, సరఫరా వ్యవస్థలు, ఇతరత్రా వ్యవస్థల వల్ల రిలయన్స్ రిటైల్‌కూ ప్రయోజనకరమే.
రిలయన్స్‌కు ఏమిటి లాభం?
రిలయన్స్ రిటైల్‌లో వాటా విక్రయంతో సున్నా నికర అప్పుల హోదా కొనసాగడంతో పాటు మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి వీలు అవుతుందని మూడీస్, ఫిచ్ రేటింగ్స్ అంటున్నాయి. బ్యాలెన్స్ షీట్లపై ఎలాంటి ఒత్తిడి పడకుండా కంపెనీ లక్ష్యాలను చేరుకోవడానికి వాటాల విక్రయం మంచి వ్యూహమేనని అవి అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ రిటైల్‌కు ఉన్న ఆఫ్‌లైన్ రిటైల్ నెట్‌వర్క్, అమెజాన్‌కున్న రవాణా నెట్‌వర్క్‌తో దేశంలో ఇ-కామర్స్ వ్యాప్తిని మరింత వేగవంతం చేస్తాయని క్రెడిట్ సూయిజీ అంటోంది.
ఊహాజనిత వార్తలపై స్పందించం..ఆర్‌ఐఎల్
కాగా, తుది నిర్ణయం ఇంకా జరగలేదని చర్చలు కొనసాగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఈ విషయంపై స్పందించేందుకు అమెజాన్ ప్రతినిధి నిరాకరించారు. రిలయన్స్ ప్రతినిధి కూడా ఊహాజనిత వార్తలపై స్పందించమని పేర్కొన్నారు. ‘మా కంపెనీ పలు అవకాశాలను పరిశీలిస్తోంది. ఏదైనా ఒప్పందం జరిగితే నియామకాల ప్రకారం వెల్లడిస్తామ’ని తెలిపారు. ‘ఊహాజనిత వార్తలను మేం ధ్రువీకరించలేం.. నిరాకరించలేం. అయితే ఏదైనా ఊహాజనిత వార్తలు వచ్చినపుడు మీడియా జాగ్రత్తగా పరిశీలించి.. పాఠకులకు(అందులో ఎక్కువగా రిటైల్ మదుపర్లు ఉండొచ్చు) సరైన సమాచారం ఇవ్వాలి. నిజం కాని లేదా తెలియని సమాచారం ఇవ్వరాద’ని ఎక్స్ఛేంజీలకిచ్చిన సమాచారంలోనూ తెలిపింది.
మరిన్ని పెట్టుబడులు..
సిల్వర్ లేక్ పార్టనర్స్ ఇప్పటికే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రకటించింది. అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ అండ్ కో కూడా1 బి.డాలర్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మార్కెట్ విలువలో రికార్డు.. 200 బి. డాలర్లకు
రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం మరో మైలురాయిని చేరింది. దేశంలోనే 200 బి. డాలర్ల మార్కెట్ విలువను అధిగమించిన తొలి నమోదిత కంపెనీగా రికార్డు సృష్టించింది. ఒక దశలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు 8.49% పెరగడంతో మార్కెట్ విలువ రూ.15,84,908 కోట్ల (215.75 బి. డాలర్లు)కు చేరుకుంది. అయితే చివరకు 7.1% లాభంతో రూ.2314.65 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్ విలువ 199.74 బి.డాలర్లకు చేరింది.
ఇదీ చూడండి: భారత్‌కు మరో ఉద్దీపన ప్యాకేజీ అవసరం:ఐఎంఎఫ్