కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు ప్రముఖ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపన్నహస్తం అందిస్తోంది. కరోనా సృష్టించిన విలయంతో ఆస్పత్రుల్లో బెడ్‌లు లేక, ఆక్సిజన్ కొరత వేధిస్తున్న తరుణంలో అలాంటి కీలక అవసరాలను తీర్చడంలో ఎనలేని సహకారం అందిస్తోంది. తద్వారా కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో అవసరమైన అస్త్రాలను సమకూరుస్తూ అనేకమంది ప్రాణాలను కాపాడుతోంది.
జామ్‌నగర్‌లోని రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌లో ప్లాంట్ల ద్వారా రోజూ 1000 మెట్రిక్ టన్నుల మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను యుద్ధప్రాతిపదికన ఉత్పత్తి చేసి దేశానికి అందిస్తోంది. ఇది సగటున కనీసం లక్ష మందికి పైగా ఆక్సిజన్ అవసరాలను తీరుస్తోంది. రిలయన్స్ ఉత్పత్తి చేసే ఆక్సిజన్ దేశ ఉత్పత్తిలో 11శాతం పైనే. జామ్‌నగర్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణాకు సంబంధించిన వ్యవహారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
ఏప్రిల్‌లో 15వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా
ఒక్క ఏప్రిల్ నెలలోనే దాదాపు 15వేల మెట్రిక్ టన్నులకు పైగా మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేసింది. ఇది దాదాపు 15లక్షల మంది రోగులకు సరిపోనుంది. దేశంలో 10మందికి ఆక్సిజన్ అందిస్తే అందులో ఒకరికి రిలయన్స్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయిన ప్రాణవాయువునే అందించడం విశేషం. అలాగే, 24 ఐఎస్‌ఓ కంటైనర్లను విదేశాల నుంచి విమానాల్లో తీసుకొచ్చి ఆక్సిజన్ సరఫరా కోసం వినియోగించింది. వాస్తవానికి, రిలయన్స్ మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్ ఉత్పత్తదారు కాదు. కరోనా మహమ్మారికి ముందు మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయని ఆ సంస్థ ఇప్పుడు ఏకంగా దేశంలోనే అత్యధిక ప్రాణవాయువు సరఫరాదారుగా అవతరించి సేవలందిస్తుండటం విశేషం. ఒకేచోట నుంచి భారీగా ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తూ అనేకమంది ప్రాణాలను కాపాడుతోంది. నాణ్యతతో కూడిన మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా రవాణాలోనూ వినూత్న పద్ధతులను అనుసరిస్తోంది. రైలు, రోడ్డు మార్గాలను ఎంచుకొని వేగంగా సరఫరాచేస్తోంది. ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆక్సిజన్‌ను రాష్ట్రాలు/ కేంద్రపాలితప్రాంతాలకు సురక్షితంగా చేర్చడంలో పకడ్బందీ వ్యూహాలను అమలుచేస్తోంది. ఈ ప్రక్రియలో ఆ సంస్థ ఇంజినీర్లు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.
గతేడాది మార్చిలో మన దేశంలోకి కొవిడ్ ప్రవేశించినప్పటి నుంచి 55000 మెట్రిక్ టన్నులకు పైగా మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌ను దేశ వ్యాప్తంగా సరఫరా చేసినట్టు రిలయన్స్ సంస్థ వెల్లడించింది. ఆక్సిజన్ రవాణాకు నైట్రోజెన్ ట్యాంకర్లను ట్రాన్స్‌పోర్ట్ ట్రక్కులుగా ఉపయోగించినట్టు తెలిపింది. సౌదీ అరేబియా, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, థాయిలాండ్ దేశాల నుంచి 24 ఐఎస్‌ఓ కంటైనర్లను విమానాల్లో తీసుకొచ్చి తద్వారా 500 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు దోహదంచేసింది. ఈ ISO కంటైనర్లు దేశంలో మెడికల్ గ్రేడ్ లిక్విడ్ ఆక్సిజన్‌కు రవాణాలో నెలకొన్న ఇబ్బందులను తొలగించడంలో తోడ్పడ్డాయి. రాబోయే రోజుల్లో మరిన్ని ఐఎస్‌వో కంటైనర్లును వినియోగించనున్నట్టు ఆ సంస్థ తెలిపింది. కరోనాపై పోరాటంలో భారత్‌కు సహకరించేందుకు ISO కంటైనర్‌లను సమకూర్చి, రవాణా చేయడంలో సాయం చేసిన ఆరామ్‌కో, బీపీ, ఐఏఎస్‌లకు రిలయన్స్ ఫౌండేషన్ కృతజ్ఞతలు తెలిపింది.
ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదు: ముకేశ్ అంబానీ
కరోనా సెకండ్ వేవ్‌తో నెలకొన్న క్లిష్ట సమయంలో తమ సంస్థ చేపడుతున్న చర్యలపై రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. కరోనా వ్యతిరేక పోరాటంలో తనకు, తన సంస్థకు ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడటం కన్నా ఏదీ ముఖ్యం కాదన్నారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా సామర్థ్యాలను భారత్ తక్షణమే పెంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కొత్త సవాల్‌ను ఎదుర్కొనేందుకు జామ్‌నగర్‌లోని తమ ఇంజినీర్లు అవిశ్రాంతంగా పనిచేస్తూ అవసరమైన ఆక్సిజన్‌ను అందిస్తుండటం గర్వంగా ఉందన్నారు.
చేయగలిగినంత సాయం చేస్తున్నాం: నీతా
దేశం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోందని రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ అన్నారు. ఈ పోరాటంలో తాము చేయగలిగినంత సాయం అందిస్తున్నామన్నారు. ప్రతి ప్రాణమూ విలువైందేనని చెప్పారు. జామ్‌నగర్ రిఫైనరీలోని తమ ప్లాంట్‌లు దేశానికి ఆక్సిజన్ అందించేందుకు రాత్రిళ్లు కూడా పనిచేస్తున్నాయన్నారు. దేశ ప్రజల వెన్నంటే ఉంటామని, అందరం కలిసి ఈ కఠిన సమయాన్ని అధిగమిద్దామని నీతా పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:హోం లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్బీఐ