టెలికాం రంగానికి(telecom relief package) సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన సంస్కరణలపై టెలికాం సంస్థలు(telecom companies in india) హర్షం వ్యక్తం చేశాయి. కేంద్రం చేపట్టిన చర్యలు టెలికాం రంగంలో ఓ కొత్త శకానికి నాంది అని పేర్కొన్నాయి. బకాయిలతో సతమతమవుతున్న ఈ రంగానికి చేయూత అందినట్లు అయిందని తెలిపాయి.
"టెలికాం రంగం అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అనే విషయం ఈ చర్యలు ద్వారా స్పష్టం అవుతోంది. ఈ చర్యలు.. దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం నిర్ణయాత్మకతను ప్రతిబింబిస్తాయి."
-కుమార మంగళం బిర్లా, వొడాఫోన్ ఐడియా ఛైర్మన్
"కేంద్రం చేపట్టిన సంస్కరణలు టెలికాం రంగానికి ఊతమిస్తాయి. నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగపడతాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యలు టెలికాం రంగంలోని ఓ కొత్త శకానికి నాంది."
-సునీల్ మిట్టల్, భారతి ఎయిర్టెల్
"ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, ఉపశమన చర్యలు.. టెలికాం రంగం తన లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కేంద్రం చేపట్టిన ఈ చర్యలను స్వాగతిస్తున్నాను. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు."
-ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్
పలు రక్షణాత్మక నిబంధనలతో.. టెలికాం రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం పచ్చజెండా ఊపింది. టెలికాం కంపెనీల చట్టబద్ధమైన బకాయిల చెల్లింపుపై 4 ఏళ్లు మారటోరియం విధిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మారటోరియం వినియోగించుకునే కంపెనీలు వడ్డీ చెల్లించాలని స్పష్టం చేసింది. టెలికాం కంపెనీలు బకాయిలు చెల్లించేందుకు గడువును మరికొంతకాలంపాటు పెంచింది.
టెలికాం కంపెనీల సవరించిన స్ధూల ఆదాయం బకాయిలు.. ఏజీఆర్ నిర్వచనాన్ని హేతుబద్ధం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. టెలికాం ఇతర ఆదాయాన్ని ఏజీఆర్ నుంచి తొలగించనున్నట్లు సంకేతాలిచ్చింది.
ఇదీ చూడండి : వాహనరంగానికి భారీ ప్రోత్సాహకాలు.. టెలికాంకు ఊరట