Recruiting trends in 2022: ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ మార్కెట్లో తీవ్రమైన ఒడుదొడుకులు వచ్చేశాయి. కొవిడ్ పరిణామాల ఫలితంగా అనివార్యంగా డిజిటైజేషన్ నుంచి హైబ్రిడ్ ఆఫీసులదాకా విస్తృతంగా వచ్చిన మార్పులు మనం చూశాం. వర్తమాన అనిశ్చిత పరిస్థితుల్లో వీలైనంత దీర్ఘకాలం ఉపాధికి వీలు కల్పించే సామర్థ్యమున్న ఉద్యోగాలకు విలువ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో గత అయిదు సంవత్సరాలుగా మనదేశంలో నిలకడగా, వేగంగా వృద్ధి చెందుతూవచ్చిన ఉద్యోగాల గురించి తెలుసుకోవడం, వాటికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఉద్యోగార్థుల కర్తవ్యం.
Hiringh trends in 2022:
అఫిలియేట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్
నెట్‌వర్క్స్‌కు అనుసంధానంగా ప్రోగ్రాములు, క్యాంపెయిన్‌లను వీరు రూపొందిస్తారు. ఈ ఉద్యోగంలో రాణించాలంటే అఫిలియేట్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ నెట్‌వర్క్స్‌లో నైపుణ్యాలు ఉండాలి. ఈ రంగంలో రెండున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. న్యూదిల్లీ, ముంబయి, బెంగళూరుల్లో అధిక ఉద్యోగావకాశాలుంటాయి. మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్, ఈ-లర్నింగ్, ఇంటర్నెట్ రంగాల్లో అవకాశాలుంటాయి. వస్తువులు, ఇతర సేవలను పొందడానికి వినియోగదారులను వెబ్‌సైట్లకు పంపడం ద్వారా ఆదాయాన్ని సంపాదించవచ్చు. సొంత వెబ్‌సైట్ లేదా బ్లాగ్ ఉన్నా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ఆర్జించవచ్చు.
Popular Recruiting trends 2022:
డేటా సైన్స్ స్పెషలిస్ట్
పెద్ద మొత్తంలో డేటాను సమీకరించడం, అన్వయించడం వీరి ప్రధాన విధులు. వినియోగదారుల, మార్కెట్ పోకడలకు అనుగుణంగా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తారు. డేటాసైన్స్ వర్క్‌లో ప్రాథమిక స్థాయుల గురించి తెలుసుకోవడం, స్టాటిస్టిక్స్ అండ్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, మైనింగ్ అండ్ మెషిన్ లర్నింగ్ నేర్చుకోవడం అవసరం. డేటాసైన్స్ సంబంధిత రంగాల్లో రాణించాలంటే స్టాటిస్టిక్స్‌పై పట్టు ఉంటే మంచిది. మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, పైతాన్ (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్) నైపుణ్యాలు ఉండాలి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్, ఈ-లర్నింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. బెంగళూరు, నూదిల్లీ, చెన్నైల్లో అధిక ఉద్యోగావకాశాలు పొందొచ్చు. నాలుగున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
Popular jobs in 2022
సైట్ రిలయబిలిటీ ఇంజినీర్
వీరు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ కార్యకలాపాలను సజావుగా సాగేలా చేస్తారు. సైట్ రిలయబిలిటీ ఇంజినీరింగ్, కుబర్‌నెట్స్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) నైపుణ్యాలు అవసరమవుతాయి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ రంగాల్లో అవకాశాలుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ రంగంలో అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
మాలిక్యులర్ బయాలజిస్ట్
కణాల పనితీరు, ప్రవర్తనలను అర్థంచేసుకునేందుకు అధ్యయనం, ప్రయోగశాలల్లో పరిశోధనలు చేస్తారు. మాలిక్యులర్ బయాలజీ, డీఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్, పాలిమెరేజ్ చెయిన్ రియాక్షన్ (పీసీఆర్)లలో వీరికి నైపుణ్యాలు అవసరం. హాస్పిటల్ అంట్ హెల్త్‌కేర్, బయోటెక్నాలజీ, హెల్త్, వెల్‌నెస్ అండ్ ఫిట్‌నెస్ రంగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. ముంబయి, చెన్నై, బెంగళూరుల్లో ఎక్కువగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. సుమారు మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వెల్‌నెస్ స్పెషలిస్ట్
వివిధ సంస్థల ఉద్యోగుల ఆరోగ్య, శారీరక దార్ఢ్య లక్ష్యాల సాధనకు ఈ నిపుణులు శిక్షణను అందిస్తారు. వీరికి వెయిట్ మేనేజ్‌మెంట్, వెల్‌నెస్ కోచింగ్ నైపుణ్యాలు ఉండాలి. హెల్త్, వెల్‌నెస్ అండ్ ఫిట్‌నెస్, కంజ్యూమర్ గూడ్స్ మొదలైన రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ముంబయి, న్యూదిల్లీ, బెంగళూరుల్లో వీరికి ఉపాధి అవకాశాలు ఎక్కువ. ఈ రంగంలో అయిదేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఈ-బిజినెస్ మేనేజర్
ఈ- కామర్స్ వేదికల మీద సంస్థకు చెందిన వివిధ వస్తువుల ఉనికిని నిర్వహిస్తూ, ఉత్పత్తుల విక్రయం పర్యవేక్షిస్తారు. మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/ బిజినెస్/ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్స్ లేదా తత్సమాన డిగ్రీ చదివి ఉండాలి. ఈ-బిజినెస్, బిజినెస్ డెవలప్‌మెంట్, టీమ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉండాలి. ఆయిల్ అండ్ ఎనర్జీ, కన్స్యూమర్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో వీరికి ఉపాధి లభిస్తుంది. న్యూదిల్లీ, బెంగళూరు, చెన్నైలలో నియామకాలు అధికం. ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం
చీఫ్ లీగల్ ఆఫీసర్
సంస్థకు చెందిన న్యాయ విభాగానికి వీరు అధిపతిగా ఉంటారు. చట్టపరమైన విషయాల్లో సంస్థకు దిశానిర్దేశం చేస్తూ.. చట్టపరమైన ఇబ్బందులేవీ రాకుండా చూస్తారు. వీరికి కార్పొరేట్ లా, టీమ్ మేనేజ్‌మెంట్, లీగల్ అడ్వైజ్ నైపుణ్యాలు ఉండాలి. నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. నూదిల్లీ, ముంబయి, చెన్నైలలో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఈ రంగంలో మూడున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
యూజర్ ఎక్స్‌పీరియన్స్ రిసెర్చర్
వ్యాపార వ్యూహం, ఉత్పత్తులను రూపొందించడానికి సహకరించేలా వినియోగదారుల ప్రేరణ, ప్రాధాన్యాలు, అలవాట్లను వీరు అధ్యయనం చేస్తారు. యూజబిలిటీ టెస్టింగ్, వినియోగదారుల అనుభవం (యూఎక్స్), నైపుణ్యాలు ఉండాలి. ఇంటర్నెట్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, డిజైన్ రంగాల్లో వీరికి అవకాశాలుంటాయి. బెంగళూరు, ముంబయి, న్యూదిల్లీల్లో అధిక ఉద్యోగావకాశాలుంటాయి. ఈ రంగంలో నాలుగున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
మెషిన్‌లర్నింగ్ ఇంజినీర్
ఉత్పత్తులు, అప్లికేషన్లకు స్వయంచాలిత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అల్గారిద]మ్స్‌నూ, సిస్టమ్స్‌నూ వృద్ధిచేసి అమలుపరుస్తారు. డీప్ లర్నింగ్, మెషిన్ లర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) నైపుణ్యాలు ఉండాలి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ రంగాల్లో అవకాశాలుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, ముంబయిల్లో అధిక నియామకాలు జరుగుతున్నాయి. మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తోంది.
రిక్రూట్‌మెంట్ అసోసియేట్
వీరు సంస్థల్లోని ఉద్యోగుల్లో దాగున్న కొత్త టాలెంట్‌ను గుర్తించే దిశగా ప్రయత్నాలు చేస్తారు. వీరికి స్క్రీనింగ్, సోర్సింగ్, రిక్రూటింగ్ నైపుణ్యాలు ఉండాలి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, ఈ-లర్నింగ్, స్టాఫింగ్ అండ్ రిక్రూటింగ్ రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బెంగళూరు, దిల్లీ, ముంబయి లాంటి చోట్ల ఈ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ఈ రంగంలో మూడేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
బ్యాక్ ఎండ్ డెవలపర్
సర్వర్-సైడ్ టెక్నాలజీ, కోడ్‌కు రూపకల్పన చేస్తారు. ఫ్రంట్ ఎండ్ వెబ్, మొబైల్ అప్లికేషన్స్‌కు ఈ టెక్నాలజీ అవసరమవుతుంది. వీరికి నోడ్.జేఎస్, మాంగోడీబీ, జావాస్క్రిప్ట్ నైపుణ్యాలు ఉండాలి. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్ రంగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బెంగళూరు, నూదిల్లీ, ముంబయిల్లో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయి. రెండున్నరేళ్ల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: మెదడుకు మస్కా.. మానవ జీవితాన్ని మార్చేసే 'న్యూరాలింక్'!