RBI new Rule on Online Card Transactions: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ పోర్టళ్లలో గానీ.. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లో గానీ ఇప్పటి వరకు మనం ఒకసారి కార్డు వివరాలు ఎంటర్ చేస్తే మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. ఇకపై అలా కుదరదు. జనవరి 1 నుంచి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఏదైనా లావాదేవీ జరపాలంటే మీ క్రెడిట్/డెబిట్ కార్డుపై ఉన్న వివరాలన్నీ ఎంటర్ చేయాల్సిందే. అలాకాకుండా మునుపటిలా సులువుగా మీ లావాదేవీ పూర్తి చేయాలంటే మీ కార్డును టోకనైజ్ చేయాలి. ఇంతకీ ఏంటీ టోకనైజేషన్? ఎలా చేయాలి?
Rbi New Rules 2021: ఇ-కామర్స్ వేదికల్లో ఒకసారి మనం కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే భవిష్యత్ కొనుగోళ్ల కోసం ఆ కార్డు వివరాలను సదరు ఇ-కామర్స్ వేదికలు సేవ్ చేసుకునేవి. అయితే, వినియోగదారుల భద్రత కోసం ఆర్‌బీఐ నిబంధనలను మార్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. అంటే ఆయా వేదికలేవీ ఇకపై కార్డు వివరాలను భద్రపరచకూడదు. కేవలం వినియోగదారుడు టోకనైజేషన్‌కు అనుమతిస్తేనే సేవ్ చేయాలి. ఆ వివరాలు ప్రత్యేకమైన ఆల్గారిథమ్‌తో రూపొందించిన కోడ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. ఇలా టోకనైజ్ చేయడం వల్ల భవిష్యత్ కొనుగోళ్ల సమయంలో కార్డులోని చివరి నాలుగు అంకెలు వినియోగదారుడికి మాత్రమే కనిపిస్తాయి.
ఇప్పటికే కొన్ని కంపెనీలు టోకనైజేషన్ కోసం 'సేవ్ కార్డు యాజ్ పర్ ఆర్‌బీఐ న్యూ గైడ్‌లైన్స్' అనే ఆప్షన్‌ను వినియోగదారుల ముందుంచుతున్నాయి. ఒకవేళ ఆ ఆప్షన్ ఎంచుకోకపోతే మీ వివరాలు ఇకపై ఆ యాప్‌లోగానీ, పోర్టల్‌లో గానీ కనిపించవు. ఇది కేవలం దేశీయ లావాదేవీలకు మాత్రమే.. అంతర్జాతీయ లావాదేవీలకు ఈ నిబంధన వర్తించదు. టోకనైజ్‌కు ఎలాంటి అదనపు రుసుములూ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఇదీ చదవండి: కొవిడ్ టీకా తీసుకోని ఉద్యోగులకు జీతం కట్!