రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)(RBI News Today) ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సమావేశాన్ని బుధవారం ప్రారంభించింది. అంతర్జాతీయ కమొడిటీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుకోవడమే లక్ష్యంగా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. అందువల్ల వరుసగా ఎనిమిదోసారీ ఆర్‌బీఐ(Reserve bank of india news) కీలక రేట్లను యథాపూర్వ స్థితిలోనే కొనసాగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ(ఎమ్‌పీసీ) తీసుకునే నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం వెల్లడిస్తారు.
ప్రస్తుతం రెపో రేటు 4 శాతం వద్ద; రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద ఉన్నాయి. 'ముడి చమురు, సహజ వాయువు, బొగ్గు ధరలు ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతాయ'ని పీడబ్ల్యూసీ ఇండియా అధిపతి రాణేన్ బెనర్జీ(పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఎకనమిక్స్) అంటున్నారు. 'రేట్ల పెంపు ఉండకపోవచ్చు.
ద్రవ్యోల్బణం ఇంకా భరించగలిగే స్థాయిలోనే ఉండడం; 10 ఏళ్ల బాండ్ల ప్రతిఫలం 6 శాతం పైన కొనసాగుతుండడం ఇందుకు కారణాల'ని అంచనా వేశారు.
వృద్ధి సంకేతాలు కనిపిస్తున్నా.. ఆర్‌బీఐ యథాస్థితినే కొనసాగిస్తుందని స్థిరాస్తి కంపెనీలు సైతం అంటున్నాయి.
ఇదీ చదవండి: జియో సేవలకు అంతరాయం- యూజర్లకు ఇబ్బందులు!