RBI Central Board Meeting: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలకు సంబంధించి వివిధ అంశాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సెంట్రల్ బోర్డు శుక్రవారం చర్చించింది. సీబీడీసీని తీసుకొచ్చేందుకు దశలవారీగా వ్యూహాల అమలు సహా ఇతరత్రా పలు అంశాలపై ఆర్‌బీఐ పరిశీలన చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిప్టోకరెన్సీతో ఆర్థిక స్థిరత్వానికి ఇబ్బందులు ఎదురవుతాయనే అభిప్రాయాన్ని ఆర్‌బీఐ పలుమార్లు బలంగా వ్యక్తం చేసింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ బిల్లును తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు ఈ రెండు అంశాలపై తాజాగా చర్చించింది. ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్ నేతృత్వంలో లఖ్‌నవూలో ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల 592వ సమావేశం శుక్రవారం జరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఇందులో సీబీడీసీ, ప్రైవేట్ క్రిప్టోల అంశంతో పాటు అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న ఆర్థిక స్థితిగతులు, సవాళ్లు, పరిష్కారాలపై బోర్డు డైరెక్టర్లు చర్చించారని తెలిపింది. 2021 సెప్టెంబరు 30తో ముగిసిన అర్ధసంవత్సర ఆదాయ స్టేట్‌మెంట్‌పైనా చర్చ జరిగిందని వివరించింది.
ఈ సమావేశంలో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్లు, సెంట్రల్ బోర్డులోని ఇతర డైరెక్టర్లు, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి దేవాశిష్ పాండా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
India Spam Calls: 'ఒకే నంబర్ నుంచి 20 కోట్ల స్పామ్ కాల్స్'