ప్రభుత్వం తీసుకున్న అధిక రుణాలు వృద్ధిని నిరాకరిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి 5 శాతం కన్నా తక్కువకు పడిపోయిన నేపథ్యంలో సమర్థవంతమైన వనరుల వినియోగం కోసం చేసే ఖర్చులకు కొత్త రూపు ఇవ్వడం ఒక్కటే ప్రస్తుతం కనిపిస్తున్న అవకాశం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రభుత్వం తన వ్యయాలను పెంచాలన్న డిమాండ్లను పలువురు లేవనెత్తుతున్నారు.
2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి... వరుసగా మూడో ఏడాది వృద్ధి మందగించింది. 2012-13లో సంభవించిన మందగమనంలా కాకుండా ఈసారి వాస్తవ జీడీపీలో ఏకంగా 1.8 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఫలితాలపై వ్యాపార వర్గాలు నిరాశలో ఉన్నాయి. భవిష్యత్ ఆదాయ పెరుగుదలపై నిరాశగా ఉన్న వినియోగదారులు సైతం అదే ధోరణిలో ఉన్నారు.
'వ్యయాలు పరిష్కారం కాదు'
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని కేంద్రంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఉద్దీపన చర్యలు చేపట్టాలని అన్నివైపుల నుంచి అభ్యర్థనలు రావడం సహజం. మరోవైపు సంయమనం పాటించాలని కొందరు భిన్న వాదన వినిపిస్తున్నారు. ప్రభుత్వ వ్యయాలు పెంచడం ద్వారా భారత్‌లో నెలకొన్న దీర్ఘకాల తిరోగమన సమస్యకు పరిష్కారం కాదని సూచిస్తున్నారు.
ప్రభుత్వ వ్యయాలను పెంచడం ద్వారా సుస్థిర వృద్ధి సాధించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చా?అంటే... దీనికి సులభమైన సమాధానాలు, షరతులు లేని సమాధానాలు లేవు. సమగ్ర ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు మిళితమై ఉంటాయి. అవన్నీ ఒకేసారి వృద్ధి సాధించలేవు. అదే విధంగా ఒకేసారి మందగమనానికే గురయ్యే అవకాశం లేదు. ఉద్దీపనలకు ఒక రంగం సానుకూలంగా స్పందిస్తే.. మరొక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
ఉదాహరణకు ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా భారీగా నిధులు కేటాయించడం వల్ల రైతులకు నేరుగా సొమ్ము అందుతుందనడంలో సందేహం లేదు. ఇది అధిక వ్యయాలకు తోడ్పాటునందిస్తుంది. వారి ఆదాయాలతో పోల్చుకుంటే ధనవంతుల కన్నా పేదవారే అధికంగా ఖర్చు చేస్తారు. భారత్‌లో వారి జనాభా అధికం కాబట్టి సగటు డిమాండ్, జీడీపీలపై సానుకూల ప్రభావం పడుతుంది. మిగిలిన అంశాలన్నీ సమానంగా ఉన్న పక్షంలో.. ప్రతిస్పందన పరిణామాన్ని పెరిగే వ్యయాలు నిర్దేశిస్తాయి.
పెట్టుబడులు లేకపోతే అంతే...
అయితే పెట్టుబడులలో ఎలాంటి మార్పు, ప్రతిస్పందన లేకుంటే ఈ ప్రభావం కేవలం కొంత కాలానికే పరిమితమవుతుంది. ఫలితంగా ఇది ఉపాధి, ఆదాయ వృద్ధికి దారితీస్తుంది. పతనమవుతోన్న జీడీపీకి అనుగుణంగా ప్రస్తుత వ్యయాలు పెరగడాన్ని పరిశీలిస్తే తాత్కాలిక ఉద్దీపన చర్యలు స్పష్టమవుతున్నాయి.
ఆహారం, ఫర్టిలైజర్, ఇందన సబ్సిడీల వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు, పీఎం కిసాన్ సహా పంటలకు చేయూతనందించే ఇతర పథకాల వ్యయాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2018 ఆర్థిక సంవత్సరంలో 35 శాతం పెరిగాయి. 2019 లో 23 శాతం పెరుగుదల నమోదు చేశాయి. అయినప్పటికీ వృద్ధి మందగించింది. వినియోగదారుల వ్యయాలూ పెరగలేదు.
మరోవైపు ప్రభుత్వం రోడ్లు, బ్రిడ్జ్‌లు, పోర్టులు నిర్మించడానికి ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఈ విధంగా చూస్తే ఆయా కాంట్రాక్టుల ద్వారా సిమెంట్, స్టీల్ సహా ఇతర భవన నిర్మాణ వస్తువుల విక్రయాలు పెరిగి నిర్మాణ రంగంలో నైపుణ్యం లేని కార్మికులకు ఉపాది పెరిగే అవకాశం ఉంటుంది.
సాధారణంగా అటువంటి ఖర్చులకు ప్రారంభ మొత్తాలను మించి రాబడి వస్తుంది. ఎందుకంటే కొత్త రవాణా మార్గాలు నిర్మించడం ద్వారా మరిన్ని అవకాశాలు లభిస్తాయి.
భారీ పెట్టుబడులు
2014-19 సంవత్సరాల మధ్య మౌలిక వసతులపై ప్రభుత్వం పెట్టుబడులు భారీగానే పెట్టింది. 2018, 2019 ఆర్థిక సంవత్సరాలలో ఈ పెట్టుబడులు రూ.4 ట్రిలియన్లకు చేరుకున్నాయి. అయినా... వాస్తవ జీడీపీ వృద్ధి రేటు మాత్రం 7.2 శాతానికి(2017లో 8.2శాతం) పతనమైంది. 2019 ఆర్థిక సంవత్సరంలో ఎకాయెకి 5 శాతానికి పడిపోయింది.
ఈ పరిణామాలన్నీ తేలిగ్గా తీసిపారేసేవి కాదు. చేస్తున్న వ్యయాలకు తగినట్లు రాబడి రాకపోతే ప్రభుత్వాలు తమ వైఖరి మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి పన్ను, పన్నేతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాలు పరిమితంగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి కోసం మరింత రుణాలు తీసుకొచ్చే అవకాశం లేదు. ఫలితంగా వనరులు క్షీణించడం సహా ప్రతికూల ప్రభావాలు ముంచుకొస్తాయి. ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇదే స్థితిలో ఉంది. వృద్ధి క్షీణించడానికి తోడు మూలధన వ్యయాలు, కరెంట్ ఎక్స్పెండిచర్లో పెరుగుదల నమోదు చేయడం దీనికి ఓ సంకేతం.
ప్రభుత్వ బ్యాలెన్స్ షీట్లకు ద్రవ్యలోటు ఓ నియంత్రణ రేఖ వంటిది. ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య తేడాను రుణాలు తీసుకురావడం ద్వారా భర్తీ చేస్తారు. కార్పొరేట్ పన్నుల్లో కోత విధించడం, వృద్ధి మందగమనం వంటి పరిణామాలు ఆదాయాల పరిస్థితిని మరింత దిగజార్చింది. పన్ను ఆదాయాలు దాదాపు రూ.2.6 నుంచి రూ.3 ట్రిలియన్ల వరకు క్షీణించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత రెండు దశాబ్దాలలో ప్రత్యక్ష పన్నుల రాబడి తగ్గడం ఇదే ప్రథమం కావడం గమనార్హం.
ప్రభుత్వ ప్రయత్నాలు
భారత్ పెట్రోలియం, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో జాప్యం కారణంగా పన్నేతర రాబడులూ తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక సంవత్సరం మొదట్లో రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వం తీసుకున్న రూ.1.5 ట్రిలియన్ల డివిడెండ్‌కి తోడు మరో రూ.100 బిలియన్ల మధ్యంతర డివిడెండ్‌ను తీసుకొని ఆదాయాలను తిరిగి పొందడానికి ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటు ఆయిల్ కంపెనీలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెద్ద మొత్తంలో డివిడెండ్లు, టెలికాం సంస్థల బకాయిలను సేకరించే ప్రయత్నంలో ఉంది. ప్రభుత్వం ఎంత నగదు కొరతతో ఉందనే విషయానికి ఈ దుర్భర పరిస్థితులన్నీ అద్దం పడుతున్నాయి.
మరోవైపు ద్రవ్య లోటు 3.3 శాతానికి పరిమితం చేస్తామన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. జీడీపీతో పోలిస్తే ద్రవ్యలోటు 3.8శాతం నుంచి 4.1శాతానికి పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఎఫ్సీ, ఎఫ్‌సీఐ వంటి సంస్థల ద్వారా తీసుకొచ్చిన అప్పులు వీటికి మినహాయింపు కావడం గమనార్హం. ఆర్థిక వ్యయాలకు అధికారిక లోటు అడ్డంకిని అధిగమించడానికి గతంలో ప్రభుత్వం ఎక్కువగా ఉపయోగించిన మార్గం ఇదే.
క్రౌడింగ్ అవుట్
అయినప్పటికీ ఆర్థిక లోటు క్రమంగా తగ్గించి, ప్రభుత్వ రుణాలను సాధారణ స్థాయికి తీసుకురావాలని సూచించే ఆర్థిక చట్టాలకు(ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) యాక్ట్-2003) ప్రభుత్వం ఇప్పటికే కట్టుబడి ఉంది. నగదు కొరత ఫలితంగా ప్రభుత్వేతర, ప్రైవేటు వ్యక్తులకు రుణాలు అధిక వడ్డీ రేట్లకు లభిస్తాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఆర్థిక శాస్త్ర పరిభాషలో 'క్రౌడింగ్ అవుట్' అంటారు.
ఉద్దీపణలకూ అప్పులే!
ప్రభుత్వ అధిక వ్యయాల కారణంగా ప్రైవేటు రంగంలో డిమాండ్ పతనమయ్యే అవకాశం ఉంది. ఎఫ్ఆర్బీఎం రివ్యూ కమిటీ సిఫార్సు చేసినట్లు జీడీపీలో 0.5 శాతం వరకు ఆర్థిక ఉద్దీపణలు చేపట్టవచ్చని కొంతమంది సూచిస్తున్నారు. దీని అర్థం మరింత రుణాలు తీసుకోవడమే.
మరోవైపు ఎఫ్ఆర్బీఎం అవరోధాలను తొలగించుకోవడానికి చట్టాన్ని సవరించి వృద్ధిపై దృష్టి సారించాలని మరికొంత మంది సూచిస్తున్నారు. దీని ద్వారా విశ్వసనీయతను, మార్కెట్ల నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లు అవుతుంది. సమయం తక్కువగా ఉన్న ఈ పరిస్థితుల్లో తదనంతర పరిణామాలకు క్షేత్రస్థాయిలో మార్కెట్లను సిద్ధం చేయకుండా ఆ చర్యలు చేపట్టడం అంటే స్వీయ గోల్ చేసుకోవడమే.
అంతేకాక ఈ ద్రవ్యలోటు సమస్యాత్మకమైనది మాత్రమే కాదు. ప్రస్తుతం ప్రభుత్వ రుణాలు(కేంద్ర, రాష్ట్రాలు కలిపి) జీడీపీలో దాదాపు 70 శాతంగా ఉన్నాయి. వీటిని రేటింగ్ సంస్థలు, పెట్టుబడిదారులు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఇది ప్రతికూలంగా ఉంటే వారి విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది.
పరిష్కారం!
ప్రస్తుతం ప్రశ్నేంటంటే డిమాండ్‌కు ఊతమివ్వడానికి ప్రభుత్వం మరిన్ని అప్పులు చేయాలా?... ఉచితంగా ఏదీ లభించదు. దేశంలోని చాలా ప్రైవేటు రంగాలు రుణాలు కలిగి ఉండటం లేదా అపరిష్కృత మొండిబకాయిల సమస్యతో సతమతమవుతున్నాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, సూక్ష్మ మధ్య స్థాయి పరిశ్రమలతో పాటు గృహాలు సైతం ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇతర అంశాలతో పాటు మృదువైన వడ్డీ రేట్లు అందించే వాతావరణం ఏర్పాటు చేయడం, ప్రభుత్వాలు తక్కువ రుణాలు తీసుకోవడం సమస్య పరిష్కారానికి ఉపకరిస్తాయి.
బ్యాలెన్స్ షీట్‌లోని వ్యయాలకు కట్టుబడి ఉండడమే ప్రభుత్వానికి ప్రస్తుతమున్న ఉత్తమ, ఏకైక మార్గం. అయితే అనవసర సబ్సిడీల వంటి కొన్ని వ్యయాలను అదుపు చేసి డిమాండ్‌ను పెంచడానికి సమర్థవంతంగా వినియోగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిష్టాత్మకమైన వ్యయాలను పెంచడానికి దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఫలితంగా కొంతకాలం తక్కువ వృద్ధిని అంగీకరించాలని పరిస్థితులు చెబుతున్నాయి.
(రచయిత-రేణు కోహ్లీ, ఆర్థికవేత్త, దిల్లీ)