కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షల ప్రభావం.. టాటా మోటార్స్ తయారీ కార్యకలాపాలపై పడింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పుణెలోని తయారీకేంద్రాన్ని అతి తక్కువ మంది ఉద్యోగులతో నడుపుతున్నట్లు సంస్థ వెల్లడించింది. నెక్సన్, హారియర్, ఆల్ట్రోజ్, సఫారీ వంటి మోడళ్లు పుణెలోనే తయారవుతున్నాయి.
కొవిడ్ నిబంధనలతోనే..
కొవిడ్ వ్యాప్తి గొలుసును తుంచేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే తయారీ కేంద్రాన్ని నడుపుతున్నట్లు టాటా మోటార్స్ వెల్లడించింది. అన్ని కరోనా నిబంధనలకు కట్టుబడుతూ ఉద్యోగులు పరిమిత సంఖ్యలో విధుల్లో పాల్గొంటున్నారని తెలిపింది. ఉద్యోగుల భద్రతపై సంస్థ నిరంతరం అప్రమత్తంగా ఉందని పేర్కొంది. ఉద్యోగులందరికీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం సహా.. గేట్ల వద్దే క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నామని తెలిపింది. ఒకవేళ ఎవరిలోనైనా లక్షణాలు గుర్తిస్తే వెంటనే వారిని ఐసోలేట్ చేసి కావాల్సిన సహకారం అందిస్తున్నామని వెల్లడించింది. అలాగే అర్హత ఉన్నవారికి స్థానిక ఆరోగ్య యంత్రాంగం సమన్వయంతో టీకాలు అందజేస్తున్నామని తెలిపింది.
ఇదీ చదవండి: నీరవ్ మోదీని అప్పగించేందుకు బ్రిటన్ అంగీకారం