ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా కొనసాగుతున్న కొంతమంది ప్రముఖ అమెరికన్లు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలు ఇప్పుడు ఆ దేశంలో చర్చనీయాంశమయ్యాయి. వీటిని ప్రోపబ్లికా అనే మీడియా సంస్థ తమ పరిశోధనాత్మక కథనం ద్వారా వెలుగులోకి తెచ్చింది. గత 15 ఏళ్ల 'ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్‌ఎస్)' డేటా రికార్డులను సంపాదించి ఈ విషయాలు బయటకు తెచ్చినట్లు ప్రోపబ్లికా పేర్కొంది. ధనవంతుల జాబితాలోని తొలి 25 మంది ఆదాయ పన్ను వివరాలు విస్తుగొల్పుతున్నాయి. వారి సంపద పెరిగిన తీరుకు, చెల్లిస్తున్న పన్నుకు ఏమాత్రం పొంతన లేదని ప్రోపబ్లికా అభిప్రాయపడింది.
బలమైన వ్యవస్థ వట్టిదే..
అమెరికా పన్ను వ్యవస్థ చాలా పటిష్ఠమైందన్న వాదన వట్టిదేనని దీంతో తేలిపోయిందని ప్రోపబ్లికా వ్యాఖ్యానించింది. అగ్రరాజ్యంలో ప్రతిఒక్కరూ తమ వాటా పన్ను నిజాయితీగా చెల్లిస్తారని.. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో కుబేరులు భారీ మొత్తంలో అందజేస్తారని ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని పేర్కొంది. అయితే, ఈ సమాచారాన్ని ఇంకా ఎవరూ అధికారికంగా ధ్రువీకరించలేదు. కొంత మంది మాత్రం ప్రముఖుల వ్యక్తిగత సమాచారం బయటకు ఎలా పొక్కిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని.. సమాచారాన్ని బయటకు లీక్ చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ప్రోపబ్లికా నివేదిక ప్రకారం..
- 2007లో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ అప్పటికే మల్టీబిలియనీర్‌గా ఉన్నప్పటికీ ఒక్క డాలర్ కూడా ఆదాయపు పన్ను కింద చెల్లించలేదు. 2011లోనూ ఇదే పరిస్థితి.
- విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు, ఎలాన్ మస్క్ 2018లో ఒక్క డాలర్ కూడా ఆదాయపు పన్ను చెల్లించలేదు.
- మైకేల్ బ్లూమ్‌బర్గ్, బిలియనీర్ ఇన్వెస్టర్లు కార్ల్ ఇకాన్, జార్జ్ సోరోస్ కూడా పలుమార్లు ఒక్క డాలర్ ఆదాయపు పన్ను కూడా చెల్లించలేదు.
దీంతో పాటు వారెట్ బఫెట్, బిల్‌గేట్స్, రూపర్ట్ మర్డాక్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖులకు సంబంధించి విస్తుగొలిపే ఆర్థిక విషయాలు ఐఆర్‌ఎస్ డేటా ద్వారా బయటకు వచ్చాయని ప్రోపబ్లికా పేర్కొంది.
సగటు వ్యక్తి ఆదాయం 70 వేల డాలర్లు..
అమెరికాలో సగటున ఒక్కో వ్యక్తి ఏడాదికి 70 వేల డాలర్లు ఆర్జిస్తున్నాడని ప్రోపబ్లికా తెలిపింది. దీంట్లో 14 శాతం పన్ను కింద చెల్లిస్తున్నారని పేర్కొంది. ఇక 6,28,300 డాలర్లకు పైగా ఆర్జించే దంపతుల్లో గరిష్ఠంగా 37 శాతం ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని వెల్లడించింది.
కుబేరులు మాత్రం ఈ వ్యవస్థను చాలా విజయవంతంగా కొల్లగొడుతున్నారని వ్యాఖ్యానించింది ప్రోపబ్లికా. ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోందని.. ధనవంతులు పన్ను ఎలా ఎగవేశారు? ఎలాంటి పద్ధతులను అనుసరించారు? చట్టంలో వారికి సహకరించిన అంశాలేంటి? అనే అంశాలపై తదుపరి కథనాల్లో వెల్లడిస్తామని వివరించింది.
ఇవీ చడవండి: