కొవిడ్ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను ఇష్టానుసారం విక్రయిస్తున్న విధానానికి కేంద్రం చెక్ పెట్టింది. వీటి విక్రయాలపై పంపిణీదారు స్థాయిలో లాభాన్ని (ట్రేడ్ మార్జిన్‌ను) గరిష్ఠంగా 70 శాతానికి పరిమితం చేస్తూ కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. పంపిణీదారు (డిస్ట్రిబ్యూటర్) స్థాయిలో ట్రేడ్ మార్జిన్ 198% దాకా ఉన్నట్లు గమనించిన కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
సాధారణంగా రూ.30,000-60,000 మధ్య లభించే ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను నెల రోజులుగా రూ.1,00,000-1,50,000 వరకు విక్రయిస్తుండటం గమనార్హం. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (డీపీసీఓ) 2013లోని 19వ పేరాలో ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పీపీఏ), గరిష్ఠ విక్రయ ధరపై పంపిణీదారు ట్రేడ్ మార్జిన్‌ను 70 శాతానికి పరిమితం చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం.. తయారీదారులు/దిగుమతిదారులు 70 శాతంలోపు మార్జిన్ కలిపి గరిష్ఠ విక్రయ ధర (రిటైల్) ధరను లెక్కించాల్సి ఉంటుంది. దీనిపై జీఎస్‌టీ అదనం. ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లపై 12 శాతం జీఎస్‌టీ అమల్లో ఉంది. ఈ నెల 9 నుంచి సవరించిన గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)లను తమకు తెలియజేయాలని ఎన్‌పీపీఏ ఆదేశించింది. కొత్త ఎంఆర్‌పీలను వారం రోజుల్లోపు బహిరంగంగా ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనలను తయారీ, దిగుమతిదారులు అమలు చేయకపోతే డీపీసీఓ 2013, నిత్యావసర వస్తువుల చట్టం 1995 ప్రకారం అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని 15% వడ్డీతో డిపాజిట్ చేయడం సహా 100% వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
ఇదీ చూడండి: Oxygen: భారీగా తగ్గిన ఆక్సిజన్ ధరలు