వివిధ కారణాల రీత్య భారత్‌లో నిషేధాన్ని ఎదుక్కొన్న పబ్జీ.. తిరిగి దేశంలో రీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకుగానూ మే 18 నుంచి ప్లే స్టోర్‌లో అడుగు పెట్టేందుకు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా పేరుతో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు సౌత్ కొరియా వీడియో గేమ్ డెవలపర్ క్రాఫ్టన్ తెలిపింది.
ఇప్పుడు వస్తున్న గేమ్‌లో భారతీయుల కోసం మాత్రమే ప్రత్యేకమైన రివార్డులు ఉంచారు. పబ్జీ అభిమానులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు వాటిని పొందవచ్చని తెలుస్తోంది. ఈ యాప్ కేవలం భారత్‌లో ఉన్న అభిమానులకు మాత్రమే అని తెలిపింది.
'బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దయచేసి గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి 'ప్రీ-రిజిస్టర్' బటన్‌పై క్లిక్ చేయండి. గేమ్ రివార్డ్‌ను కూడా పొందండి' అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
నిషేధం ఇందుకే..
చైనాతో సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన అనేక యాప్స్‌పై భారత ప్రభుత్వం గతేడాది నిషేధం విధించింది. వాటిల్లో పబ్జీ ఒకటి. అయితే పబ్జీ ప్రత్యక్షంగా చైనా యాప్ కాదు. చైనా ఆధారిత టెన్సెంట్ సంస్థకు పబ్జీతో సంబంధం ఉండటం వల్ల యాప్ నిషేధానికి గురైంది. అనంతరం ఆ సంస్థ పబ్జీ కార్పొరేషన్ నుంచి తప్పుకుంది. అప్పటి నుంచి.. పబ్జీని తిరిగి దేశంలో విడుదల చేసేందుకు మాతృసంస్థ క్రాఫ్టాన్ ప్రయత్నిస్తూనే ఉంది.
ఇదీ చూడండి: ఉద్యోగుల వేటలో పబ్జీ.. ఇక రీఎంట్రీకి ఫిక్స్!