వాణిజ్య యుద్ధంతో దాదాపు రెండేళ్ల పాటు వార్తల్లో నిలిచిన అమెరికా-చైనా.. ఇప్పుడు స్నేహగీతం పాడుతునట్టు కనిపిస్తోంది. ఎన్నో చర్చలు, సమావేశాల తర్వాత ఈ నెల 15న ఇరు దేశాల మధ్య తొలి దశ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసే అవకాశముందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. అది పూర్తి కాక ముందే రెండో దశ ఒప్పందంపై సంకేతాలిచ్చారు ట్రంప్. ఆలస్యం కాకుండానే రెండో దశ ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభమవుతాయని అగ్రరాజ్య అధ్యక్షుడు స్పష్టం చేశారు. కానీ ఈ చర్చల ఫలితాల కోసం అమెరికా అధ్యక్ష ఎన్నికల వరకు వేచి చూడాలన్నారు.
"ఫేజ్ 2 కోసం వెంటనే సంప్రదింపులు ప్రారంభిస్తాం. కానీ ఎన్నికల వరకూ వేచి చూడాలి. ఆ తర్వాతే మంచి, మెరుగైన ఒప్పందం కుదుర్చుకోవచ్చు."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
వాణిజ్య యుద్ధంతో రెండు అగ్రరాజ్యాల మధ్య ఇన్నేళ్లు నడిచిన మాటల యుద్ధం.. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. అయితే అనేక దశలుగా సాగిన చర్చల అనంతరం గతేడాది డిసెంబర్లో అమెరికా-చైనా మధ్య తొలి దఫా వాణిజ్య ఒప్పందంపై సంధి కుదిరింది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది రోజుల్లో బీజింగ్ నుంచి ఓ బృందం అమెరికాకు వెళ్లనునట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ట్రేడ్ వార్‌కు చెక్.. వాణిజ్య ఒప్పందానికి అంగీకారం