గూగుల్ 'ప్లేస్టోర్' నుంచి పేటీఎంను తొలగించారు. పేటీఎం, పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను తీసివేస్తూ.. ఇవాళ నిర్ణయం తీసుకుంది గూగుల్. ఈ రెండూ తమ నియమ నిబంధనలను ఉల్లంఘించాయని, వాటిని గూగుల్ ఏ మాత్రం సహించదని స్పష్టం చేసింది.
క్రీడల్లో బెట్టింగ్‌లకు సంబంధించిన యాప్స్‌ను కూడా ప్లేస్టోర్ నుంచి తొలగించనున్నట్లు పేర్కొంది గూగుల్. జూదానికి సంబంధించిన అప్లికేషన్లలో.. ఆన్లైన్ కాసినోలకు అనుమతిచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
బెట్టింగ్‌ను సులభతరం చేసే ఇలాంటి యాప్స్‌కు అనుమతిస్తే తమ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లేనని వెల్లడించింది గూగుల్ యాజమాన్యం. ఐపీఎల్ వంటి మెగా టోర్నీలకు ముందు భారీగా బెట్టింగ్ యాప్‌లు సృష్టిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పేటీఎం సహా పలు బెట్టింగ్ యాప్‌లపై గూగుల్ ప్లేస్టోర్ నిషేధం విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.