డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సేవల సంస్థ పేటీఎం 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.22,000 కోట్లు) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు కంపెనీ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఈ ఐపీఓ వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఎంటర్‌ప్రైజ్ విలువను రూ.2 లక్షల కోట్లకు పైగా పరిగణించి, ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.22,000 కోట్లు సమీకరించాలని పేటీఎం భావిస్తోంది.
ప్రస్తుత పెట్టుబడిదార్లు సంస్థలో తమ వాటాను కొంత మేర తగ్గించుకునేందుకు అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. ఈ విషయంపై స్పందించేందుకు పేటీఎం నిరాకరించింది. పేటీఎం పబ్లిక్ ఇష్యూ ఈ స్థాయిలో జరిగితే దేశంలోనే అత్యధిక మొత్తంలో నిధులు సమీకరిస్తున్న ఐపీఓగా ఇది చరిత్ర సృష్టించనుంది. పేటీఎంలో అలీబాబా యాంట్ గ్రూప్ (29.71 శాతం), సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ (19.63%), సైఫ్ పార్ట్‌నర్స్ (18.56%), విజయ్ శేఖర్ శర్మ (14.67%) వాటాదార్లుగా ఉన్నారు. ఏజీహెచ్ హోల్డింగ్, టి రోవే ప్రైస్ అండ్ డిస్కవరీ క్యాపిటల్, బెర్క్‌షేర్ హాథవేలకు 10 శాతం కంటే తక్కువ వాటా ఉంది.
తమ పోటీ సంస్థలతో పోలిస్తే సుమారు 30-50 శాతం అధికంగా లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు పేటీఎం వెల్లడించింది. నెలవారీగా 140 కోట్లకు పైగా లావాదేవీలు తమ ప్లాట్‌ఫామ్‌పై జరుగుతాయని పేర్కొంది.
ఇదీ చూడండి: గుడ్ న్యూస్: ఈఎస్ఐ, ఈపీఎఫ్‌తో అదనపు ప్రయోజనాలు