ప్రముఖ డిజిటల్ నగదు బదిలీ సంస్థ పేటీఎం కీలక ప్రకటన చేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంకు లిమిటెడ్(పీపీబీఎల్) ఖాతాదారులు కరోనా విపత్తు సమయంలో.. కాలు బయట పెట్టకుండా 'క్యాష్ ఎట్ హోమ్'(ఇంటి వద్దకే డబ్బు)ని అందిస్తామని ప్రకటించింది. దేశ రాజధాని ప్రాంతంలో వృద్ధులకు, వికలాంగులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఏం చేయాలి?
పేటీఎం పేమెంట్ బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉన్నవారు వారి చరవాణిలో పేటీఎం యాప్ తెరిచి.. తమ ఖాతా నుంచి ఎంత డబ్బు కావాలనుకుంటున్నారో అభ్యర్థిస్తే సరిపోతుంది. ఈ మేరకు ఖాతాలో ఉన్న చిరునామాకు డబ్బులు డెలివరీ చేస్తామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కనిష్ఠంగా రూ.1000.. గరిష్ఠంగా రూ.5000 పరిమితి వరకు ఈ సేవల ద్వారా నగదు ఉపసంహరించుకోవచ్చని తెలిపింది.
"బ్యాంకింగ్ రంగాన్ని మరింత సౌకర్యవంతంగా వినియోగదారులకు అందుబాటులో ఉంచడానికి.. బ్యాంకు ప్రారంభించిన సేవల్లో 'క్యాష్ ఎట్ హోమ్' సౌకర్యం కొత్తది. ఇటీవల ప్రత్యక్ష బదిలీ ప్రయోజన(డీబీటీ) సదుపాయాన్ని ప్రారంభించాం. దీని ద్వారా వినియోగదారులు 400కు పైగా ప్రభుత్వ రాయితీల ప్రయోజనాలు నేరుగా వారి పీపీబీఎల్ పొదుపు ఖాతాలోకి వెళ్లిపోతాయి." -పేటీఎం పేమెంట్ బ్యాంకు లిమిటెడ్
మరింత విస్తృతంగా..
"మా ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు సులభతరం చేస్తూ.. దేశంలో డిజిటల్ బ్యాంక్ పరిధిని విస్తరించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాం. వయస్సు, అనారోగ్యం, ఇతర సమస్యల కారణంగా ఎటీఎం లేదా బ్యాంకులకు వెళ్లలేని వారికి నూతన 'క్యాష్ ఎట్ హోమ్' సౌకర్యం ఎంతో సహాయపడుతుంది" అని పీపీబీఎల్ సీఈఓ సతీశ్ కుమార్ గుప్తా తెలిపారు.
ఇదీ చూడండి: రూ. లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి