దేశీయంగా ప్యాసిజర్ వాహన టోకు విక్రయాలు ఈ ఏడాది జనవరిలో 11.14 శాతం (గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే) పెరిగాయి. గత నెల మొత్తం 2,76,554 యూనిట్లు విక్రయమయ్యాయి. 2020 జనవరిలో 2,48,840 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడైనట్లు భారత వాహన తయారీదారుల సంఘం (సియామ్) తాజా గణాంకాల ద్వారా తెలిసింది.
సియామ్ గణాంకాల్లో తేలిన మరిన్ని విషయాలు..
గత నెల ద్విచక్ర వాహన విక్రయాలు 6.63 శాతం పెరిగి.. 14,29,928 యూనిట్లుగా నమోదయ్యాయి. 2020 జనవరిలో ఈ సంఖ్య 13,41,005గా ఉంది.
మోటార్ సైకిళ్ల విక్రయాలూ 2021 జనవరిలో 5.1 శాతం పుంజుకున్నాయి. మొత్తం 9,16,365 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2020 జనవరిలో 8,71,886 మోటార్ సైకిళ్లు విక్రయమయ్యాయి.
కేటగిరీల వారీగా ఈ ఏడాది జనవరిలో 17,32,817 వాహనాలు అమ్ముడయ్యాయి. 2020 జనవరిలో విక్రయమైన 16,50,812 యూనిట్లతో పోలిస్తే ఈ మొత్తం 4.97 శాతం అధికం.
సెమీకండక్టర్ల కొరత, పెరిగిన కంటైనర్ల ఛార్జీలు సహా సరఫరా వ్యవస్థలో అనేక సవాళ్లు ఎదురైనా.. గతనెల భారీగా వాహన విక్రయాలు పెరిగినట్లు సియామ్ వెల్లడించింది.
ఇదీ చదవండి:ట్విట్టర్‌కు మరోమారు కేంద్రం వార్నింగ్!