ఆఫ్‌షోర్ కంపెనీలు, ట్రస్టులతో పలువురు భారతీయులు విదేశాల్లో సాగించిన లావాదేవీలను పాండోరా పత్రాలు ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇందులో రాడియా, జాకీ ష్రాఫ్, వినోద్ అదానీ వంటి ప్రముఖుల వివరాలు ఉన్నాయి. ఈ పత్రాల ప్రకారం.. ఆయా వ్యక్తులు సాగించిన వ్యవహారాలివీ..
రాడియా..
మునుపటి పనామా, పారడైజ్ పత్రాల్లో వెలుగు చూసిన కార్పొరేట్ పైరవీకారణి నీరా రాడియా పేరు పాండోరా పత్రాల్లోనూ కనిపించింది. ఆమెకు డజను ఆఫ్‌ఫోర్ సంస్థలతో సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. ఈ సంస్థలు సాగించిన లావాదేవీలూ వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ (బీవీఐ)లో తనకు సంబంధించిన కంపెనీ ద్వారా ఆమె వజ్రాలు పొదిగిన వాచీని 2,51,500 డాలర్లతో దుబాయ్‌లో కొనుగోలు చేశారు. లండన్‌కు చెందిన సంజయ్ నెవాతియా ద్వారా రాడియా ఆఫ్‌షోర్ లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని ట్రైడెంట్ ట్రస్టుకు ఆమె క్లయింట్‌గా ఉన్నారు.
జాకీ ష్రాఫ్
తన అత్త న్యూజిలాండ్‌లో ఏర్పాటు చేసిన 'మీడియా ట్రస్టు' అనే సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన లబ్ధిదారుగా ఉన్నారు. ఈ సంస్థకు ఆయన 'గణనీయంగా విరాళాలి'చ్చారు. ట్రస్టుకు స్విస్ బ్యాంకు ఖాతా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ (బీవీఐ)లో నమోదైన ఒక ఆఫ్‌షోర్ కంపెనీ కూడా ఉంది. జాకీ కుమారుడు జై (టైగర్), కుమార్తె కృష్ణ ష్రాఫ్ కూడా ఇందులో లబ్ధిదారులే.
సమీర్ థాపర్
టెక్స్‌టైల్ సంస్థ జేసీటీ లిమిటెడ్ సీఎండీ సమీర్ థాపర్‌కు బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో నమోదైన 'మస్క్ హోల్డింగ్స్' అనే ఆఫ్‌షోర్ సంస్థతో సంబంధం ఉంది. ఈ సంస్థ జేసీటీలో వాటాదారు.
వినోద్ అదానీ
బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ శాంతిలాల్ షా అదానీ.. బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో మూడేళ్ల కిందట 'హైబిస్కస్ ఆర్‌ఈ హోల్డింగ్స్ లిమిటెడ్' అనే ఆఫ్‌షోర్ కంపెనీని ఏర్పాటు చేశారు. 50వేల షేర్లతో ఆయనొక్కరే ఇందులో వాటాదారుగా ఉన్నారు. అయితే ఆ సంస్థను మూసేశానని ఆయన ఇప్పుడు చెబుతున్నారు.
ఇక్బాల్ మిర్చి
మాఫియా ముఠా నాయకుడు దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు ఇక్బాల్ మిర్చి పేరు కూడా బయటపడింది. భారత్, దుబాయ్‌లో ఇక్బాల్‌కు సంబంధించిన వందల కోట్ల ఆస్తులను జప్తు చేసినప్పటికీ అతడి కుటుంబ సభ్యుల అక్రమ వ్యవహారాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. పాకిస్థాన్ మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ షఫాత్ ఉల్లా షాతో కలిసి వారు ఆఫ్‌షోర్ లావాదేవీలు సాగించారు. షఫాత్.. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు సైనిక కార్యదర్శిగా, జోర్డాన్‌లో పాక్ రాయబారిగా పనిచేశారు. ఇక్బాల్ కుటుంబానికి 17 ఆఫ్‌షోర్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి. అతడిని 1994లో స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. 2013లో గుండెపోటుతో లండన్‌లో మరణించాడు.
సతీశ్ శర్మ
దివంగత కాంగ్రెస్ నేత, గాంధీ కుటుంబానికి సన్నిహితుడు కెప్టెన్ సతీశ్ శర్మకు ఆఫ్‌షోర్ సంస్థలు, విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. జన్ జెగర్స్ అనే ట్రస్టులో శర్మ భార్య, కుమారులు, కుమార్తెలు, మనుమలు సహా 10 మంది లబ్ధిదారులుగా ఉన్నారు. ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఈ వివరాలను ఆయన ఎన్నడూ వెల్లడించలేదు. జన్ జెగర్స్ ట్రస్టును 1995లో కేమన్ దీవుల్లో ఏర్పాటు చేశారు. నాడు ఆయన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా వ్యవహరించారు. 2015 అక్టోబరులో జేజెడ్ 2 అనే మరో ట్రస్టును న్యూజిలాండ్‌లో ఏర్పాటు చేశారు. నాడు శర్మ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రెండు ట్రస్టుల్లోనూ ఆయన సంరక్షకుడిగా ఉండగా.. ఆయన భార్య స్టెరీ లబ్ధిదారుగా ఉన్నారు. ఫ్రాన్స్, సింగపూర్‌లోని తన ఆస్తుల నిర్వహణకు వీటిని ఉపయోగించుకున్నారు.
పీటర్ కేర్కర్
'కాక్స్ అండ్ కింగ్స్' సీఈఓ అజయ్ అజిత్ పీటర్ కేర్కర్‌కు బ్రిటిష్ వర్జిన్ దీవుల్లో రెండు ట్రస్టులు ఉన్నాయి. దాదాపు అరడజను ఆఫ్‌షోర్ సంస్థలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ.. భారత్‌లో బ్యాంకులకు రూ.5,500 కోట్లు బకాయిపడింది. కేర్కర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు.
తప్పుడు ఆరోపణలు: మజుందార్ షా
తన భర్త జాన్ మెక్‌కల్లమ్ మార్షల్ షాకు సంబంధించిన ఆఫ్‌షోర్ ట్రస్టుపై వచ్చిన ఆరోపణలను బయోటెక్నాలజీ సంస్థ 'బయోకాన్' కార్యనిర్వాహక ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా ఖండించారు. 'నా భర్తకు సంబంధించిన ఆఫ్‌షోర్ ట్రస్టుపై మీడియాలో తప్పుడు కథనాలు వస్తున్నాయి. అది చట్టబద్ధమైన ట్రస్టు. స్వతంత్ర ధర్మకర్తలు దాన్ని నిర్వహిస్తున్నారు' అని పేర్కొన్నారు. పాండోరా పత్రాల ప్రకారం.. డీన్‌స్టోన్ ట్రస్టు అనే ఈ సంస్థ 2015లో న్యూజిలాండ్‌లో ఏర్పాటైంది. మారిషస్‌కు చెందిన గ్లెన్‌టెక్ ఇంటర్నేషనల్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. గ్లెన్‌టెక్‌లో మజుందార్ షా భర్తకు 99 శాతం వాటాలు ఉన్నాయి. డీన్‌స్టోన్ ట్రస్టుకు కునాల్ అశోక్ కశ్యప్ సంరక్షకుడిగా ఉన్నారు. అయితే.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో 'సెబీ' అతడిపై నిషేధం విధించింది.
దర్యాప్తు చేస్తాం: ఇమ్రాన్
పాండోరా పత్రాల్లో వెలుగు చూసిన పాక్ జాతీయులందరిపై దర్యాప్తు చేపడతామని ఆ దేశ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. జాబితాలో పాక్‌కు చెందిన అనేక మంది మంత్రులు, మాజీ సైనిక, పౌర అధికారులు, వ్యాపారవేత్తలు, మీడియా సంస్థల అధిపతులు ఉన్నారు.
పన్ను ఎగవేత మార్గాలను నిర్మూలించాలి
పాండోరా ఉదంతం నేపథ్యంలో.. పన్ను ఎగవేత మార్గాలను నిర్మూలించాలంటూ హక్కుల సంస్థ 'ఆక్స్‌ఫామ్ ఇండియా' డిమాండ్ చేసింది. వీటివల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు ఏటా 427 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు చెప్పింది. ప్రధానంగా వర్ధమాన దేశాలపై ఈ భారం ఎక్కువగా పడుతోందని వివరించింది. నేరాలు, అవినీతి వర్థిల్లడానికి ఇవి కారణమవుతున్నాయని పేర్కొంది.
ఇవీ చదవండి: