గత ఏడాది కరోనా సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. ప్రతి రంగాన్ని ఈ మహమ్మారి దెబ్బతీసింది. దీని ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పైనా తీవ్రంగా పడింది. అదేమిటి కరోనా ఉన్న దుబాయ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి కాదా? ఇంకా కరోనా ప్రభావం అంటారేమిటి.. అనుకుంటున్నారా? అయితే ఇది మ్యాచ్‌ల పరంగా కాదు. ఐపీఎల్ బ్రాండ్ విలువ పరంగా.
కరోనా వల్ల ఐపీఎల్ బ్రాండ్ విలువ 2020లో 3.6 శాతం తగ్గి.. రూ.45,800 కోట్లకు పడిపోయింది. 2019లో ఈ విలువ రూ.47,500 కోట్లు(2018తో పోలిస్తే ఇది 7 శాతం అధికం)గా ఉంది. డఫ్&ఫెల్ఫ్స్ అనే సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం తెలిసింది.
నివేదికలోని మరిన్ని విషయాలు..
- ఐపీఎల్ ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ కూడా కరోనా కారణంగా భారీగా తగ్గింది. అయినప్పటికీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన ముంబయి ఇండియన్స్ (ఎంఐ) బ్రాండ్ విలువ పరంగా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2020లో దీని బ్రాండ్ విలువ 2019తో పోలిస్తే 5.9 శాతం కోల్పోయి.. రూ.761 కోట్లకు తగ్గింది.
- చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ల బ్రాండ్ విలువ అత్యధికంగా వరుసగా 16.5 శాతం, 13.7 శాతం పడిపోయి.. రూ.732 కోట్లు, రూ.611 కోట్లకు చేరింది.
- స్పాన్సర్షిప్ రెవెన్యూ, స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతి లేకపోవడం వంటివి ఫ్రాంచైజీల బ్రాండ్ విలువ తగ్గేందుకు ప్రధాన కారణం.
- ఇంట్లోనే కూర్చుని పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ చూడటం వల్ల.. టీవీ వీక్షణలు, ప్రకటనల ఆదాయం వంటి అంశాల్లో రికార్డులు నమోదయ్యాయి.