ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ కొవిషీల్డ్.. భారత్‌లో 2021 తొలిఅర్ధభాగంలోపే అందుబాటులోకి వస్తుందని తెలిపారు ఆస్ట్రాజెనికా-ఇండియా అధ్యక్షుడు గగన్‌దీప్ సింగ్. ఫిక్కీ 93వ వార్షిక సదస్సులో భాగంగా కరోనా వ్యాక్సిన్‌పై కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుత మహమ్మారి సమయంలో పెద్దమొత్తంలో, సమానంగా, సమయానుసారంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు.
" ఆక్స్ఫర్డ్ వర్సిటీతో ఏప్రిల్ నుంచి కలిసి పనిచేస్తున్నాం. ప్రస్తుతం కొవిషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతులు వస్తాయనే నమ్మకంతో ఉన్నాం. అది 2021 తొలిఅర్ధభాగంలోపే టీకా అందుబాటులోకి వస్తుందని చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు 300 కోట్ల డోసులు అందించేందుకు ఒప్పందాలు కుదిరాయి. వైరల్ వెక్టాల్ ప్లాట్‌ఫాం విధానంతో టీకా అభివృద్ధి చేయటం వల్ల పెద్ద ఎత్తున ఉత్పత్తికి వీలుపడుతోంది. అతిపెద్ద ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సంస్థల్లో ఒకటైన సీరంతో భాగస్వామ్యం కావటం సంతోషంగా ఉంది. "
- గగన్‌దీప్ సింగ్, ఆస్ట్రాజెనికా-ఇండియా అధ్యక్షుడు
2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనే నిలువ చేసేందుకు వీలు ఉన్నందున తమ టీకా సరఫరా, నిర్వహణ చాలా సులభంగా, సౌకర్యవంతంగా ఉంటుందన్నారు సింగ్. దీంతో దేశవ్యాప్తంగా వేగంగా సరఫరా చేయొచ్చని తెలిపారు. భారత్‌లో సంబంధిత అధికారుల ఆమోదం లభించగానే.. పెద్దసంఖ్యలో టీకా పంపిణీ చేసేందుకు వీలుందని చెప్పారు.
భారత్‌లో ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ క్యాండిడేట్ 'కొవిషీల్డ్' తుదిదశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ.. డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది.
ఇదీ చూడండి: ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ సురక్షితమే..