ప్రభుత్వం ప్రకటన చేసే వరకు.. విమాన ప్రయాణాలకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించవద్దని విమానయాన సంస్థలకు సూచించారు కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
''పౌర విమానయాన మంత్రిత్వ శాఖ... దేశీయ, అంతర్జాతీయ విమాన సేవల పునరుద్ధరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.''
- ట్విట్టర్లో కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్సింగ్ పూరి.
లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత మే 4 నుంచి దేశీయ ప్రయాణాలకు, జూన్ 1 నుంచి అంతర్జాతీయ సర్వీసులకు (ఎంపిక చేసిన రూట్లలో) బుకింగ్స్ ప్రారంభిచనున్నట్లు ఎయిర్ ఇండియా తెలిపిన కొద్దిగంటల్లోనే కేంద్రమంత్రి ఈ ప్రకటన చేయడం గమనార్హం.
5 రోజుల క్రితం ఇండిగో కూడా మే 4 నుంచి దశలవారీగా విమాన సర్వీసులను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 3వరకు ఇదే పరిస్థితి ఉండనుంది. ఈ కారణంగా అన్ని రకాల ప్యాసింజర్ విమానాలు నేలకే పరిమితమయ్యాయి.