ఉల్లిగడ్డ కోయక ముందే కన్నీళ్లు తెప్పిస్తోంది. నిత్యావసర వస్తువైన ఉల్లి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫలితంగా ఉల్లి రేటు ఘాటుకు వినియోగదారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
అకాల వర్షాలతో ఖరీఫ్‌లో పంట దిగుబడి తగ్గినందున గతకొద్ది రోజులుగా ఉల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఉల్లి ధర సెంచరీని దాటేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయితో పాటు చెన్నై, కోల్‌కతాలో కిలో రూ.120కు చేరింది. దిల్లీలో రూ.100గా ఉంది. అత్యధికంగా పోర్టు బ్లెయిర్‌లో 140 రూపాయలు పలికినట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా కిలో ఉల్లి ధర సగటు రూ.110 ఉన్నట్లు స్పష్టం చేసింది.
21,000 టన్నుల దిగుమతి..
ఉల్లి కొరతను అధిగమించేందకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులను నిషేధించిన సర్కార్.. 21,000 టన్నులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. జనవరి 15 నాటికి దిగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ ఎంఎంటీసీతో కేంద్రం ఒప్పందం కదుర్చకుంది. జనవరి వరకు ఉల్లి ధరలు ఇలాగే ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:డ్యాన్స్ మధ్యలో ఆపినందుకు తుపాకీతో దాడి