ETV Bharat / business

'చైనా చేజారినా భారత్​కు దక్కడం డౌటే!' - చైనా చేజారినా.. భారత్​కు లాభిస్తుందన్న గ్యారెంటీ లేదు: అభిజిత్

నోబెల్ పురస్కార గ్రహీత, ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ... కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. యూఎస్​, యూకే, జపాన్ లాంటి దేశాలు తమ జీడీపీలో అధిక శాతం ఖర్చు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ వాణిజ్యం చైనా చేజారినంత మాత్రాన అది భారత్​కు లాభిస్తుందని కచ్చితంగా చెప్పలేమన్నారు.

Abhijit Banerjee
చైనా చేజారినా.. భారత్​కు లాభిస్తుందన్న గ్యారెంటీ లేదు: అభిజిత్
author img

By

Published : May 12, 2020, 3:31 PM IST

ప్రపంచ వాణిజ్యం చైనా చేజారినంత మాత్రాన... భారత్​ లాభపడుతుందని కచ్చితంగా చెప్పలేమని అభిప్రాయపడ్డారు ప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ. ఓ బంగాలీ న్యూస్​ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"కరోనా పుట్టుకకు చైనాయే కారణమని ప్రపంచమంతా భావిస్తోంది. అందువల్ల ప్రపంచ వాణిజ్యం చైనా చేజారిపోవచ్చని అందరూ భావిస్తున్నారు. ఫలితంగా ఇది భారత్​కు లాభం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది నిజం కాకపోవచ్చు."

- అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త

చైనా కరెన్సీ మాయలతో...

"చైనా తన కరెన్సీ విలువను తగ్గిస్తే... చైనా ఉత్పత్తులు చౌకగా లభ్యమవుతాయి. అప్పుడు ప్రతి ఒక్కరూ ఆ దేశ ఉత్పత్తులనే కొనడం కొనసాగిస్తారు."

- అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త

భారత్​ కంటే అధికంగా...

కరోనాపై పోరులో తగిన మార్గనిర్దేశం చేయడానికి బంగాల్​ ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్లోబల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడుగా అభిజిత్​ బెనర్జీ ఉన్నారు. కరోనా ధాటికి అతలాకుతలమైన పేద ప్రజానీకానికి ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1.70 లక్షల కోట్ల ప్యాకేజీపై ఆయన భిన్నంగా స్పందించారు. అమెరికా, యూకే, జపాన్ లాంటి దేశాలు తమ జీడీపీలో అధిక వాటాను ఖర్చు చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

"కేంద్ర ప్రభుత్వం దేశ జీడీపీలో ఒక శాతం కన్నా తక్కువ... అంటే రూ.1.70 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేయాలని యోచిస్తోంది. వాస్తవానికి ఈ ఖర్చు మరింతగా పెంచాల్సి ఉంది."

- అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త

కొనుగోలు శక్తి లేని ప్రజానీకం

దేశ ప్రజల్లో అధికశాతం మందికి కనీస కొనుగోలు శక్తి లేదని.. అదే అసలైన సమస్య అని అభిజిత్ బెనర్జీ పేర్కొన్నారు.

"ప్రజలకు కొనుగోలు శక్తి లేకపోవడం వల్ల... డిమాండ్ ఉండదు. అందువల్ల ప్రభుత్వం దశలవారీగా ప్రజలకు డబ్బు అందించాలి. దాని వల్ల వారు ధనవంతులేమీ అయిపోరు. కానీ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. ఒక వేళ వారు ఖర్చు చేయకపోయినా ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదు."

- అభిజిత్ బెనర్జీ, ఆర్థికవేత్త

అది కేంద్రం బాధ్యత

వలస కార్మికుల సంక్షేమం కేంద్రం బాధ్యత అని అభిజిత్ పేర్కొన్నారు. నిలువ నీడలేక, చేతిలో డబ్బు లేక సతమతమవుతున్న వారికి అత్యవసరంగా రేషన్​ కార్డులు జారీచేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. కనీసం మూడు, నుంచి ఆరు నెలల పాటు వారికి నిత్యావసరాలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

పనికి కొరత లేదు..

కరోనా సంక్షోభం నెలకొన్నప్పటికీ భారత్​లో పనికి కొరత ఏర్పడలేదని బెనర్జీ స్పష్టం చేశారు. దిల్లీ, బెంగళూరులోని కార్మికులను తమ స్వస్థలాలకు వెళ్లవద్దని యాజమాన్యాలు కోరుతున్న విషయాన్ని ఆయన ఉదహరించారు.

ఇదీ చూడండి: చైనాకు గుడ్​బై చెప్పే సంస్థలపై భారత్​​ గురి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.