కరోనా నేపథ్యంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను ముద్రించాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతానికి భారీగా కరెన్సీని ముద్రించే ప్రణాళికేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు.
మరిన్ని వివరాలు..
2020-21లో దేశ వాస్తవిక జీడీపీ అంచనా -7.3 శాతంగా ఉన్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వృద్ధి రేటులో ఈ క్షీణత.. కరోనా మహమ్మారి ప్రభావంతో పాటు.. దానిని నియంత్రించేందుకు తీసుకున్న చర్యలను ప్రతిబింబిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సంక్షోభంలోనూ దేశ ఆర్థిక మూలాలు స్థిరంగా ఉన్నట్లు మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ 2020-21లో రెండో అర్ధ భాగం నుంచి రికవరీ బాటలో పయనించేందుకు ఆత్మనిర్భర్ భారత్ మిషన్ ఎంతగానో తోడ్పడిందని వెల్లడించారు.
భారీ ప్యాకేజీ..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, ఉద్యోగ కల్పన వంటి వాటికోసం.. 2020-21లో ఆత్మ నిర్భర్ భారత్ మిషన్ కింద.. రూ.29.87 లక్షల కోట్లతో కేంద్రం ప్రత్యేక , సమగ్ర ప్యాకేజీని ప్రకటించినట్లు నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.
విస్తృత, సమగ్ర ఆర్థికాభివృద్ధికోసం.. 2021-22 కేంద్ర బడ్జెట్లోనూ.. భారీగా నిధులు కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ తన సమాధానంలో వివరించారు. ఇందులో భాగాంగా మూలధన వ్యయాలకు 34.5 శాతం, ఆరోగ్య రంగ వ్యయాలను 137 శాతం పెంచినట్లు తెలిపారు.
ప్రజా ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి, వృద్ధికి ఊతమందించేందుకు, ఉద్యోగకల్పనకు గానూ.. ఈ ఏడాది జూన్లో రూ.6.29 లక్షల కోట్లతో ప్రత్యేక ఉపశమన ప్యాకేజీని ప్రకటించినట్లు సీతారామన్ తెలిపారు
ఇదీ చూడండి: కేంద్రం కీలక నిర్ణయం- తగ్గనున్న పప్పుల ధరలు!