క్రెడిట్కార్డుతో పెట్రోల్ కొనుగోలుపై ఇప్పటి వరకు అందిస్తున్న రాయితీని నిలిపివేయాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయించాయి. అక్టోబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి.
2016లో నోట్లరద్దు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని సంకల్పించింది. అందుకోసం క్రెడిట్ కార్డుతో చెల్లింపులు చేసే వారికి పెట్రోల్ ధరలో 0.75 శాతం డిస్కౌంట్ అందించాలని ప్రభుత్వ రంగ చమురు సంస్థలను కోరింది.
ఇందుకు ఇండియన్ ఆయిల్కార్ప్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) అంగీకరించాయి. ఫలితంగా నగదు తగ్గింపుతో పాటు, మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) భారాన్ని కూడా ఈ సంస్థలే భరించాల్సి వస్తోంది.
ఈ మూడు చమురు సంస్థలు ఈ-పేమెంట్ డిస్కౌంట్, ఎండీఆర్ కింద బ్యాంకులకు... 2017-18 సంవత్సరంలో రూ.1,431 కోట్లు, 2018-19లో దాదాపు రూ.2 వేల కోట్లు చెల్లించాయి. అందుకే ఈ పెను భారాన్ని తగ్గించుకోవాలని నిర్ణయానికి వచ్చాయి. అక్టోబర్ 1 నుంచి క్రెడిట్ కార్డు చెల్లింపులపై రాయితీ ఎత్తివేస్తున్నామని ప్రకటించాయి.
అయితే డెబిట్ కార్డులు, ఈ- వాలెట్ ద్వారా చెల్లింపులు చేసేవారికి మాత్రం రాయితీ కొనసాగుతుందని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.
ఇదీ చూడండి: సంపన్నుల్లో మళ్లీ అంబానీ టాప్- ఆస్తి ఎంతంటే...