దేశ ఆర్థికవ్యవస్థకు మద్దతుగా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అయితే కొవిడ్ లాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్రం ఎన్ని చర్యలు చేపట్టినా సరిపోవని ఆమె చెప్పారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు.
2020 మొదట్లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న సంకేతాలు కన్పించాయని, కానీ కరోనా సంక్షోభం కారణంగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని నిర్మల చెప్పారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని పలు కామర్స్ ఛాంబర్స్తో సంప్రదింపులు జరిపిందని, ప్రధాని మోదీ కూడా పరిశ్రమ నుంచి అభిప్రాయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. అనంతరం కేంద్రం అవసరమైన చర్యలు చేపట్టినట్లు వివరించారు. తక్షణ ఉపశమనంగా గరీబ్ కల్యాణ్ యోజన, ఉచిత వంటగ్యాస్, ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలు ప్రకటించిందని పేర్కొన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం మూడు విభిన్న ప్రకటనలు చేసిందని నిర్మల తెలిపారు. అవకాశాలు ఒకే రంగానికి పరిమితం కాకుండా పరిశ్రమకు ప్రోత్సాహం లభించేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు.
1991 నాటి ఆర్థిక సంస్కరణలు కీలక ముందడుగు అని, కానీ అప్పటి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టి ఉంటే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇంకా మెరుగ్గా ఉండేదని నిర్మల అన్నారు.