ప్రైవేటీకరణకు నీతి ఆయోగ్ సిఫారసు చేసింది సెంట్రల్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు (ఐఓబీ) లేనని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. అయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు కూడా ఈ జాబితాలో ఉండొచ్చని పేర్కొంటున్నారు. అంటే ఈ బ్యాంకుల్లో ప్రభుత్వం తన వాటాలను విక్రయిస్తుందన్నమాట. 2021-22లో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విలీనం చేయాల్సిన లేదా ప్రైవేటీకరించాల్సిన లేదా ఇతర పీఎస్‌యూలకు అనుబంధ సంస్థలుగా మార్చాలిన ప్రభుత్వరంగ సంస్థ (పీఎస్‌యూ)ల పేర్లను నీతిఆయోగ్ సిఫారసు చేయాల్సి ఉంటుంది.
ఇందులో భాగంగా ప్రైవేటీకరణ నిమిత్తం పై రెండు బ్యాంకుల పేర్లను నీతిఆయోగ్ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలను పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్), ఆర్థిక సేవల విభాగం పరిశీలించి, చట్టపరంగా అవసరమైన మార్పులు చేస్తాయి. ప్రైవేటీకరణ ప్రక్రియ కాలపరిమితి కూడా ఈ మార్పులపైనే ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కొవిడ్-19తో ప్రైవేటీకరణ ప్రక్రియ జాప్యం: ఫిచ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ ప్రణాళిక కార్యరూపం దాల్చడం ఆలస్యం కావొచ్చని ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. కొవిడ్-19 రెండో దశ పరిణామాల్లో భారతీయ బ్యాంకింగ్ రంగం కొంత ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది.
ఇదీ చదవండి : భారత్‌కు ప్రపంచ బ్యాంకు భారీ ఆర్థిక సాయం