బడ్జెట్ సెగ్మెంట్లో వచ్చిన ఐఫోన్ ఎస్ఈ (2020) మోడల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం ప్రారంభించింది లగ్జరీ స్మార్ట్ఫోన్ల సంస్థ యాపిల్. త్వరలోనే ఈ ఫోన్లను రిటైల్, ఆన్లైన్ స్టోర్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.
ఆండ్రాయిడ్ మిడ్ సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చిన ఐఫోన్ ఎస్ఈ2 మోడల్‌పై యాపిల్ భారీ ఆశలు పెట్టుకుంది. పవర్ఫుల్ చిప్ సెట్‌తో పాటు చూసేందుకు ఐఫోన్ 8 లాగా, పని తీరులో ఐఫోన్ 11తో పోలికలుంటాయని ఆ సంస్థ చెబుతోంది. ఈ మోడల్ ధరను రూ.42,500గా నిర్ణయించింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ఈ ఫోన్ ధర రూ.38,900 వరకు తగ్గే అవకాశముంది.
దేశీయంగా తయారీ ఎందుకు?
నిజానికి యాపిల్ ఐఫోన్లకు చైనా అతిపెద్ద తయారీదారుగా ఉంది. అయితే ఇటీవల అమెరికా-చైనా మధ్య తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో ఐఫోన్ల తయారీని తగ్గించాలని నిర్ణయించింది యాపిల్. ఇందుకోసం భారత్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని ఇక్కడ ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరిస్తోంది.
ఇందులో భాగంగా దేశీయంగా ఎక్కువగా అమ్ముడవుతున్న.. ఐ ఫోన్ 11, ఐ ఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 7 మోడళ్లను చెన్నైలోని ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తోంది. ఐఫోన్ ఎస్ఈ2 మోడల్‌ను మాత్రం బెంగళూరులోని విస్ట్రోన్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తోంది.