కొవిడ్ మహమ్మారిపై పోరులో భారత్ కీలక దశకు చేరుకుందని, ఇలాంటి సమయంలో అలసత్వం ప్రదర్శించొద్దని ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. గుజరాత్ గాంధీనగర్‌లో పెట్రోలియం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. యునివర్సిటీ అధ్యక్షుడిగా ఉన్న ముకేశ్ అంబానీ కరోనాపై పోరులో అజాగ్రత్తగా ఉండటం అలసత్వం ప్రదర్శించడం మంచిది కాదని సూచించారు.
ఎన్నో అధిగమించాం
భారత్ గతంలో కూడా ఎన్నో కష్టాలు, విపత్తులను ఎదుర్కొందన్న అంబానీ ప్రతిసారి వాటి నుంచి బయటపడి మరింత దృఢంగా ఉద్భవిందని పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం, పట్టుదల మన సంస్కృతిలో బలంగా ఇమిడిపోయాయని తెలిపారు. కొవిడ్ తర్వాత దేశంలో వేగవంతమైన వృద్ధిని చూస్తామని తెలిపారు.
రానున్న రెండు దశాబ్దాల్లో ఈ వృద్ధి విస్తృత అవకాశాలు సృష్టిస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ గల దేశాల జాబితాలో భారత్ తొలి మూడు స్థానాల్లో నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా, ఆత్మవిశ్వాసంతో ఆవిష్కరణలు చేయాలని సూచించారు.