బాహుబలి సినిమాలో సింహాసనం కోసం వారసుల మధ్య వైరం.. ఎంత చేటు తీసుకొచ్చిందో చూశాం కదా. వారసుల్లో ఎవరికి పట్టాభిషేకం చేయాలి.. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది మహా రాజుకు కత్తిమీద సాము లాంటిదే. వ్యాపార సామ్రాజ్యాల అధిపతులదీ ఇదే పరిస్థితి. ధీరూభాయ్ అంబానీ మరణానంతరం.. ఆస్తులు పంచుకునే విషయంలో ఆ కుటుంబ వారసులైన ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య తలెత్తిన అభిప్రాయభేదాలు రిలయన్స్ వ్యాపార విభజనకు దారి తీసిన సంగతి తెలియంది కాదు. ఇప్పటికీ అన్నదమ్ముల మధ్య దూరం పూర్తిగా తొలగలేదనే చెబుతారు. ఇప్పుడు తన ఇద్దరు కుమారులు, కుమార్తెలకు అలాంటి అనుభవం ఎదురుకావొద్దని అనుకుంటున్నారట ముకేశ్ అంబానీ. మనస్పర్థలు తలెత్తకుండా గ్రూప్(reliance mukesh ambani group) వారసత్వ బాధ్యతలను సాఫీగా బదిలీ చేసేందుకు యోచన చేస్తున్నారని వార్తాసంస్థ బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఈ ప్రకారం..
దేశంలోనే మార్కెట్ విలువ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్దది. 208 బిలియన్ డాలర్ల (సుమారు రూ.15.60 లక్షల కోట్ల) విలువైన ఈ వ్యాపార సామ్రాజ్యం.. చమురు- రసాయనాలు, టెలికాం, రిటైల్ రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ దిగ్గజ సంస్థ వైభవం భవిష్యత్‌లోనూ కొనసాగాలంటే పటిష్ఠ వారసత్వ ప్రణాళిక అవసరం. ఆ దిశగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ (64) కసరత్తు చేస్తున్నారని, అమెరికాకు చెందిన వాల్‌మార్ట్(walmart) వ్యవస్థాపకుడు శామ్ వాల్టన్(sam walton) నడిచిన బాటను అనుసరించాలని అనుకుంటున్నారని పేర్కొంది.
ఏమిటి ఆ ప్రణాళిక..?
ఓ ట్రస్టు లాంటి సంస్థను ఏర్పాటు చేసి, తన కుటుంబ ఆస్తులన్నింటినీ దానికి బదిలీ చేసే ఆలోచనలో ముకేశ్ ఉన్నారని ఆ కథనం వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై(reliance industries) ఈ నూతన సంస్థకే పూర్తి నియంత్రణ ఉంటుందట. కొత్త సంస్థ బోర్డు సభ్యులుగా ముకేశ్ భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాశ్, అనంత్, కుమార్తె ఈశా ఉంటారు. ముకేశ్‌కు అత్యంత సన్నిహితుల్లోని కొందరికి కూడా ఇందులో చోటు కల్పిస్తారు. కంపెనీ ప్రధాన కార్యకలాపాల బాధ్యతలను వృత్తి నిపుణులైన బయటివారికి అప్పగిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రిటైలింగ్ సంస్థ అయిన వాల్‌మార్ట్ వ్యవస్థాపకులైన శామ్‌వాల్టన్ కూడా తాను చనిపోయేందుకు 40 ఏళ్ల ముందుగానే కుటుంబ వాటాలను ట్రస్ట్‌కు బదిలీ చేసి, కుటుంబ సభ్యులకు ఆ సంస్థ బోర్డు డైరెక్టరు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికీ వాల్‌మార్ట్ సామ్రాజ్యం చీలిపోకుండా ఉందంటే.. ఆయన అనుసరించిన వారసత్వ ప్రణాళికే కారణం. ఇప్పటికీ వాల్‌మార్ట్‌లో 47 శాతం వాటాను ట్రస్టులు, వాల్టన్ ఎంటర్‌ప్రైజెస్ రూపంలోనే వాల్‌మార్ట్ కుటుంబీకులు కలిగి ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి: ఈశా అంబానీకి కీలక పదవి- అంతర్జాతీయ స్థాయిలో..
సంసిద్ధం చేస్తున్నారు..
తన కుమారులు, కుమార్తె భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలనే విషయమై ఎంతో ముందు చూపుతో ముకేశ్ అంబానీ వ్యవహరిస్తున్నారని, ఇప్పటికే ఆయన తీసుకున్న నిర్ణయాల ఆధారంగా అర్థం చేసుకోవచ్చు. కొత్త తరం వ్యాపారాలైన రిటైల్, టెలికాంలలో కవలలైన ఆకాశ్ (30), ఈశా (30) క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. 2014లోనే వీరిద్దరిని ఈ రెండు వ్యాపారాల బోర్డుల్లో డైరెక్టర్లుగా ముకేశ్ నియమించారు. చిన్న కుమారుడు అనంత్ అంబానీ (26) జియో ప్లాట్‌ఫామ్స్ , పునరుత్పాదక విద్యుత్, చమురు- రసాయనాల వ్యాపారాలకు డైరెక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అన్న భళా.. తమ్ముడు డీలా..
1973లో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్‌ను ప్రారంభించగా, జౌళి నుంచి చమురు రంగాలకు విస్తరించింది. 2002లో ఆయన ఆకస్మిక మరణానంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు(reliance industries news) ముకేశ్ ఛైర్మన్‌గా, అనిల్ అంబానీ వైస్‌ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కంపెనీకి సంబంధించి ప్రధాన నిర్ణయాల విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి, మూడేళ్ల పాటు కొనసాగాయి. 2005లో తల్లి కోకిలాబెన్ సమక్షంలో ఇద్దరూ ఆస్తులను పంచుకున్నారు. అప్పుడు ముకేశ్ వాటా కింద రిఫైనింగ్, పెట్రో రసాయనాలు, చమురు-గ్యాస్, జౌళి వ్యాపారాలు వచ్చాయి. అనిల్ అంబానీకి టెలికమ్యూనికేషన్లు, ఆస్తుల నిర్వహణ, వినోదం, విద్యుత్ వ్యాపారాలు లభించాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలిసిందే. ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత కుబేరుడిగా అవతరించారు. అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యం పలు తప్పులతో కుదేలైంది.
ఇవీ చదవండి: