ఆర్థిక మందగమనం నేపథ్యంలో దేశంలోని 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. విలీన నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడ్డారు ఆర్థిక నిపుణులు. బ్యాంకుల నిర్వహణ సామర్థ్యం మెరుగవుతుందని తెలిపారు. కానీ తక్కువ మూలధనం, భారీ స్థాయిలోని నిరర్థక ఆస్తుల సమస్యలు బ్యాంకులను పీడిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.
సామర్థ్యం మెరుగవుతుంది..
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంతో వాటి నిర్వహణ సామర్థ్యం మెరుగవుతుందన్నారు మూడీస్ సంస్థలోని ఆర్థిక సంస్థల గ్రూపు ఉపాధ్యక్షులు శ్రీకాంత్ వల్దమాని. కార్పొరేట్ వ్యవస్థలో పోటీలో నిలబడేందుకు వీలుకలుగుతుందని తెలిపారు. సాంకేతిక రంగంలో పెట్టుబడులకు ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సమస్యలకు పరిష్కారం కాదు...
బ్యాంకుల విలీన నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డారు ఫిచ్ డైరెక్టర్ సస్వత గుహా. భవిష్యత్తులో మెరుగైన పనితీరు కనబరిచేందుకు ఉపయోగపడుతుందన్నారు. కానీ ప్రస్తుతం బ్యాంకులను వేధిస్తున్న తక్కువ మూలధనం, భారీ నిరర్థక ఆస్తుల సమస్యలకు పరిష్కారం కాదని అభిప్రాయపడ్డారు. బ్యాంకులు అభివృద్ధి చెంది ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలవాలంటే వాటికి మూలధనం అవసరమన్నారు గుహా.
5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది...
ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు పెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ దోహదపడుతుందన్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ రజనీశ్ కుమార్. వేగంగా వృద్ధి చెందుతున్న మనలాంటి ఆర్థిక వ్యవస్థలో పెద్ద బ్యాంకులు క్రెడిట్ అవసరాలను తీర్చడానికి మంచి ఆయుధాలుగా ఉంటాయన్నారు. బ్యాంకుల ఏకీకరణతో సమస్యలను తట్టుకునేందుకు వీలుకలుగుతుందని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తుంది..
ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని అఖిల భారత బ్యాంకు యూనియన్లు తిరస్కరించాయి. ఎలాంటి హేతుబద్ధత లేకుండా, ఆలోచన రహితంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించాయి. కోల్‌కతా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న యునైటెడ్ బ్యాంకును దిల్లీ ఆధారిత పీఎన్బీని విలీనం చేయటం సరైంది కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయం ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తుందన్నాయి. విలీన ప్రక్రియలో భాగంగా ఎస్బీఐ సుమారు వెయ్యికి పైగా, బ్యాంక్ ఆఫ్ బరోడా 500లకు పైగా బ్రాంచులను మూసివేసిందని గుర్తుచేశారు. మూసివేసిన బ్రాంచుల్లో జన్‌ధన్ ఖాతాలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించాయి యూనియన్లు.
ఇదీ చూడండి: "బ్యాంకుల విలీనంతో ఉద్యోగుల్లో ఆందోళన"