కేంద్ర ప్రభుత్వం అధీనంలోని 10 బ్యాంకులను నాలుగు అతిపెద్ద బ్యాంకులుగా మార్చే విలీనానికి సర్వంసిద్ధమైంది. బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) స్పష్టం చేసింది. దేశవ్యాప్త లాక్డౌన్ ఈ విలీన ప్రక్రియకు అడ్డంకి కాదని వెల్లడించింది.
విలీనమైన బ్యాంకు శాఖల్లోనే యథావిధిగా ఉమ్మడి బ్యాంకు పేరుతో సేవలు కొనసాగుతాయని ఓ ప్రకటన విడుదల చేసింది ఆర్బీఐ. విలీన బ్యాంకుల ఖాతాదారులు ఏ బ్యాంకులోనైతే తమ బ్యాంకు కలుస్తుందో ఆ బ్యాంకు వినియోగదారుడిగా పరిగణించి సేవలు అందిస్తారని స్పష్టం చేసింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పటిష్ఠమైన బ్యాంకింగ్ వ్యవస్థను రూపొందించే ప్రక్రియలో భాగంగా 10 బ్యాంకులను నాలుగు బ్యాంకులుగా విలీనం చేసేందుకు మార్చి 4న నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్రం.
వాయిదా వేయాలని లేఖ
కరోనాతో లాక్డౌన్ విధించిన కారణంగా బ్యాంకుల విలీన ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ కొద్దిరోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశాయి బ్యాంకు అధికారుల సంఘాలు. ఈ పరిస్థితుల్లో విలీనం చేపడితే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని తెలిపాయి. ఈ విషయంపై గత గురువారమే ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టత ఇచ్చారు. లాక్డౌన్ కారణంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
బ్యాంకుల విలీనం ఇలా..
- పంజాబ్ నేషనల్ బ్యాంకులో.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను కలిపి రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా మార్చాలని నిర్ణయించింది కేంద్రం.
- కెనరా బ్యాంకులో.. సిండికేట్ బ్యాంక్‌ను విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఇదే జరిగితే కెనరా బ్యాంకు 4వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరిస్తుంది.
- యూనియన్ బ్యాంకులో.. ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విలీనం పూర్తయితే యూనియన్ బ్యాంక్ 5వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తయారవుతుంది.
- ఇండియన్ బ్యాంకులో.. అలహాబాద్ బ్యాంకును విలీనం చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన. ఈ విలీనం పూర్తయితే దేశంలో 7వ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఇండియన్ బ్యాంకు అవతరిస్తుంది.
బ్యాంకుల మెగా విలీనం పూర్తయితే దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే ఉండనున్నాయి.
ఇదీ చూడండి: ఆపరేషన్ కరోనా: రంగంలోకి హుందాయ్, మారుతి