మహమ్మారి కరోనా దేశంలో విస్తరిస్తూ.. ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వైరస్‌ను ఎదుర్కోవటానికి హుందాయ్ ఇండియా, మారుతీ ఇండియా వాహన తయారీ సంస్థలు ముందుకొచ్చాయి. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా చర్యలు ప్రారంభించాయి.
హుందాయ్ మోటార్స్
కరోనా వైరస్‌ను పరీక్షించేందుకు దక్షిణ కొరియా నుంచి అధునాతన వైద్య పరీక్ష కిట్‌లను ఆర్డర్ చేస్తున్నట్లు హుందాయ్ ఇండియా సీఎస్ఆర్ తెలిపింది. ఈ అత్యాధునిక పరికరాలు కచ్చితమైన ఫలితాలు ఇస్తాయని, 25వేల మంది ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు హుందాయ్ మోటార్ ఇండియా ఫౌండేషన్(హెచ్ఎంఐఎఫ్) ప్రకటించింది.
పరీక్ష కిట్లు వచ్చిన తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని సంప్రదించి వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ఆసుపత్రులకు పంపిణీ చేస్తామని తెలిపింది హుందాయ్. కొవిడ్-19పై పోరాటంలో భారత్‌కు మద్దతుగా నిలుస్తామని చెప్పారు హెచ్‌ఎంఐఎల్ సీఈఓ ఎస్ఎస్ కిమ్.
మారుతీ సుజుకీ...
దేశంలో కరోనా విస్తరణ నేపథ్యంలో వెంటిలేటర్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి ఆగ్వా హెల్త్‌కేర్‌తో కలిసి పని చేయనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ) తెలిపింది. ఇప్పటికే వెంటిలేటర్ల ఉత్పత్తిదారులు, ఆగ్వాతో కలిసి పనిచేయడానికి ఏర్పాట్లు జరిగినట్లు సంస్థ అధికారులు వెల్లడించారు. నెలకు 10వేల యూనిట్లు వెంటిలేటర్లు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
సాంకేతికపరమైన బాధ్యతలు ఆగ్వా చేపట్టగా.. వెంటిలేటర్ల ఉత్పత్తి, అమ్మకం, పనితీరు తమ వంతని మారుతీ సుజుకీ తెలిపింది.
ఇదీ చూడండి: భారీగా క్షీణించిన విదేశీ మారకపు నిల్వలు