Auto PLI Scheme: వాహన, విడిభాగాల రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకం కింద మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, లుకాస్-టీవీఎస్, టాటా కమిన్స్, టయోటా కిర్లోస్కర్ ఆటో పార్ట్స్‌ల వంటి 75 కంపెనీలకు ప్రోత్సాహకాలు అందనున్నాయి. కాంపోనెంట్ ఛాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రూ.29,834 కోట్ల పెట్టుబడులు ఈ 75 కంపెనీల నుంచి రావొచ్చని ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. ఛాంపియన్ ఓఈఎమ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద 20 దరఖాస్తులకు ఇంతకుముందే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ రెండూ పీఎల్‌ఐ పథకంలో భాగంగా ఉన్నాయి. సొంతంగా అడ్వాన్స్‌డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ(ఏఏటీ) ఉత్పత్తుల సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి, తాజాగా పెట్టుబడులు పెట్టేందుకు ఈ పథకం కింద 18 శాతం వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి.
లక్ష్యాన్ని మించి పెట్టుబడులు
"వాహన, వాహన విడిభాగాల పరిశ్రమ కోసం తీసుకొచ్చిన పీఎల్‌ఐ పథకం కింద ఐదేళ్లలో రూ.42,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తే, రూ.74,850 కోట్ల ప్రతిపాదనకు వచ్చాయి. ఛాంపియన్ ఓఈఎమ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రూ.45,016 కోట్ల ప్రతిపాదనలు రాగా, విడిభాగాల ఛాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద రూ.29,834 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి" అని అధికారిక ప్రకటన తెలిపింది. మొత్తం 75 కంపెనీల్లో రెండు (భెల్, సియట్) వాహనేతర పెట్టుబడుల కంపెనీలకూ అనుమతి ఇచ్చారు. మన కంపెనీలతో పాటు జపాన్, జర్మనీ, అమెరికా, బ్రిటన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఐర్లండ్, ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ కంపెనీల దరఖాస్తులనూ అనుమతించారు. భారత ప్రగతిపై ప్రపంచానికి ఉన్న విశ్వాసాన్ని ఈ స్పందన తెలియజేస్తోందని భారీ పరిశ్రమల మంత్రి మహేంద్ర నాథ్ పాండే పేర్కొన్నారు.
ఇదీ చూడండి : చైనా కంపెనీలకు పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంక్ డేటా లీక్.. నిజమెంత?