వాట్సాప్ కొత్త గోప్యతా విధానంపై వినియోగదారుల్లో ఇంకా అనుమానాలు కొనసాగుతున్నాయని ఓ ప్రముఖ సర్వే తేల్చింది. నూతన విధానం ప్రకారం.. ఫేస్‌బుక్, ఇతర మధ్యవర్తిత్వ సంస్థలతో తమ సమాచారాన్ని పంచుకుంటే వాట్సాప్ పేమెంట్స్‌తో పాటు, బిజినెస్ చాట్‌నూ పూర్తిగా బహిష్కరిస్తామని అత్యధిక మంది వినియోగదారులు పేర్కొన్నట్లు 'లోకల్ సర్కిల్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం' నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
దేశవ్యాప్తంగా మొత్తం 17వేల మంది వాట్సాప్ వినియోగదారులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో దాదాపు ఐదు శాతం మంది ఇప్పటికే యాప్‌ను డిలీట్ చేసినట్లు తెలిపారు. మరో 22 శాతం మంది యాప్‌ను తక్కువగా వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక తమ సమాచారాన్ని ఫేస్‌బుక్, ఇతర మధ్యవర్తిత్వ సంస్థలతో పంచుకుంటే వాట్సాప్ పేమెంట్‌ను ఉపయోగించడం పూర్తిగా మానేస్తామని 92శాతం మంది తెలపడం గమనార్హం. అలాగే, కొత్త విధానాన్ని యథావిధిగా అమలు చేస్తే బిజినెస్ అకౌంట్స్‌ను వాడడం నిలిపివేస్తామని 79 శాతం మంది పేర్కొన్నారు. ఇప్పటికే 55 శాతం మంది ప్రత్యామ్నాయ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు.. వీరిలో 22 శాతం మంది వాటిని విరివిగా ఉపయోగిస్తున్నట్లు సర్వేలో తేలింది.
మరో సర్వేలోనూ..
బీఎం నెక్ట్స్ నిర్వహించిన మరో సర్వేలోనూ 82 శాతం మంది వినియోగదారులు కొత్త విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తేలింది. ప్రత్యామ్నాయ యాప్‌లను వాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని 72 శాతం మంది వెల్లడించినట్టు పేర్కొంది సర్వే.
గోప్యతా విధానంపై..
కొద్ది రోజుల క్రితం వాట్సాప్ కొత్త గోప్యతా విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా యూజర్స్ వ్యక్తిగత సమాచారంతోపాటు ఐపీ అడ్రస్ వంటి వివరాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటారంటూ కొత్త గోప్యతా విధానంపై భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఫిబ్రవరి 8 నుంచి అమలు చేయాలనుకున్న గోప్యతా విధానాన్ని మే 15కు వాయిదా వేసింది. మరోవైపు ప్రైవసీ పాలసీలో మార్పులను ఉపసంహరించుకోవాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది. ఏకపక్షంగా చేసిన ఈ మార్పులు ఆమోదయోగ్యమైనవి కాదని తెలిపింది. ఈ మేరకు వాట్సాప్ సీఈఓకు కేంద్ర సాంకేతిక, సమాచార శాఖ లేఖ రాసింది. వాట్సాప్‌కు ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగదారులు భారత్‌లో ఉన్నారని గుర్తుచేసింది.
ఇదీ చదవండి: ఎయిర్‌టెల్‌కే అధికంగా కొత్త యూజర్లు!