పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే 'వివాద్ సే విశ్వాస్' బిల్లు లోక్సభలో ఆమోదం పొందింది. పన్ను చెల్లింపు వివాదాలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించే ఈ బిల్లు.. దిల్లీ అల్లర్ల నేపథ్యంలో విపక్షాల గందరగోళం నడుమే పార్లమెంట్ దిగువసభలో గట్టెక్కింది.
బిల్లు ప్రయోజనం ఏమిటి?
పన్ను చెల్లింపుదారులు ఎలాంటి వడ్డీ, జరిమానా లేకుండా కేవలం బకాయి పడ్డ పన్నులు మార్చి 31 లోపు చెల్లించేందుకు అవకాశం కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చింది కేంద్రం.
ఈ బిల్లును లోక్సభలో ఈనెల 2న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే దిల్లీ అల్లర్లపై గందరగోళం నడుమే ఇవాళ సభామోదం లభించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రూ.9.32 లక్షల కోట్లు విలువైన సుమారు 4.83 లక్షల ప్రత్యక్ష పన్నుల కేసులు పెండింగ్లో ఉన్నాయి.
లోక్సభలో గందరగోళం..
దిల్లీ అల్లర్లపై విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. సభ ప్రారంభం కాగానే..చర్చ చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. హోంమంత్రి అమిత్ షా.. తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సభాపతి స్థానంలో స్పీకర్ ఓం బిర్లా లేకపోవడం వల్ల ఆయన ఎక్కడ అని పలువురు ప్రశ్నించారు. దిల్లీ అల్లర్లపై మార్చి 11న చర్చ చేపడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చినా విపక్ష సభ్యులు శాంతించలేదు. విపక్షాల గందరగోళంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. చివరికి రేపటికి వాయిదా పడింది.
రాజ్యసభలోనూ..
ఇవాళ రాజ్యసభ ప్రారంభంకాగానే ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలను ప్రారంభించగా.. దిల్లీ అల్లర్లపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. నినాదాలు చేస్తూ విపక్ష సభ్యులు అడ్డుతగిలిన కారణంగా శాంతించాలని వెంకయ్య పదేపదే విజ్ఞప్తి చేశారు. విపక్షాలు నినాదాలు కొనసాగించిన కారణంగా సభను రేపటికి వాయిదా వేశారు.
ఇదీ చూడండి: కరోనా కలవరం... భారత్లో ఇప్పటివరకు 28 కేసులు