ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లో నివసిస్తున్న నికిత శ్రీవాస్తవ, గౌరవ్ మాథుర్ భార్యాభర్తలు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇద్దరికీ 'వర్క్ ఫ్రం హోమ్' ఇచ్చారు. ఇన్నాళ్లు వేర్వేరు షిఫ్టుల కారణంగా వారు తీరికగా గడపడానికి అంతగా సమయం దొరికేది కాదు. ఇప్పుడు ఇద్దరూ ఇంట్లోనే ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకుంటున్నామని చెబుతున్నారు నికిత, మాథుర్. ఈ సమయంలో మునుపటి కంటే ఎక్కువగా సన్నిహితంగా ఉండగలుగుతున్నామని అంటున్నారు.
"మాకు వేర్వేరు షిఫ్టులు ఉండేవి. అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా వేర్వేరు షిఫ్టులు అయినా ఇంట్లో ఎక్కువ సమయం గడుపుతున్నాం. శారీరక సంబంధంపై మేము మా వైద్యుడితో చర్చించాం. కరోనా వైరస్‌కు ప్రభావితం కానంత వరకు మా సాన్నిహిత్యానికి ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు."
-నికిత శ్రీవాస్తవ
నికిత, మాథుర్ లాంటి ఎంతోమంది భార్యాభర్తలు, ప్రేమికులు, సహజీవనం చేసేవారిని కరోనా సెలవులు దగ్గర చేస్తున్నాయి. శారీరక సంబంధాలు కూడా మరింత ధృడం కావడం వల్ల దిల్లీలో మాస్కులతో సమానంగా కండోమ్, గర్భనిరోధక మాత్రల అమ్ముడుపోతున్నాయని ఔషధ దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ కండోమ్, గర్భనిరోధక మాత్రల కొనుగోళ్లు పెరిగాయి.
"మా దగ్గర ఉన్న మాస్కులు అయిపోయాయి. వైరస్ తీవ్రత కారణంగా ప్రస్తుతం చాలా మంది క్లోరోక్విన్, విటమిన్ సీ మాత్రలను కొనుగోలు చేస్తున్నారు. కండోమ్‌ల అమ్మకం కూడా పెరిగింది"
-షానవాజ్, లాయల్ ఫార్మసీ, దక్షిణ దిల్లీ
యుద్ధాలు, అంటువ్యాధులు ప్రబలిన సమయాల్లో సాధారణంగా కొన్ని వర్గాల్లో సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంటుందని, తద్వారా శృంగార వాంఛలు ఎక్కువ అవుతాయని చెబుతున్నారు దిల్లీకి చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రాజీవ్ మెహతా.
"పెద్ద నగరాల్లోని భార్యాభర్తలు సాధారణ సెక్స్ చేయకపోవడానికి కారణం... వారు తీరిక లేకుండా గడపడమే. తద్వారా అలసట చెందుతారు. ఇప్పుడు సమయం దొరికినందు వల్ల సాధారణ లైంగిక జీవితానికి తిరిగి వస్తున్నారు. "
-రాజీవ్ మెహతా, సైకియాట్రిస్ట్
2033లో క్వారం'టీన్స్'
కరోనా వైరస్ విజృంభణతో అందరూ నిర్బంధంలోనే ఉన్నారు. ఈ సమయంలో గర్భం దాల్చిన మహిళ డిసెంబర్లో ప్రసవించే అవకాశం ఉంటుంది. వారిని 'కరోనా వైరస్ బూమ్'గా పిలిచే అవకాశం ఉందని మెహతా చెప్పుకొచ్చారు. క్వారంటైన్ సమయంలో కడుపులో పడిన వారు 2033లో టీనేజీలో వస్తారని వివరించారు. అప్పుడు వారిని క్వారం'టీన్స్'గా పిలవ వచ్చని సరదాగా వ్యాఖ్యానించారు మెహతా.