వరుసగా ఆరో సెషన్లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. గురవారం.. బీఎస్ఈ- సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 1115 పాయింట్లు తగ్గి 36,553 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ- నిఫ్టీ 326 పాయింట్ల నష్టంతో 10,805 వద్దకు చేరింది.

నష్టాలకు కారణాలు..
అమెరికా వృద్ధి రేటుపై ప్రతికూల అంచనాలు వెలువడటం వల్ల అక్కడి మార్కెట్ల గురువారం భారీగా కుదేలయ్యాయి. ఐరోపాలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరగొచ్చనే అంచనాల నేపథ్యంలో.. కొవిడ్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తూ ఆయా దేశ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. దీనికి తోడు దేశీయంగానూ వృద్ధి రేటుపై నెలకొన్న అనిశ్చితి మదుపరుల సెంటిమెంట్ దెబ్బతీసింది. దీనితో అమ్మకాలపైనే మొగ్గు చూపారని విశ్లేషకులు అంటున్నారు.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 37,304 పాయింట్ల అత్యధిక స్థాయి, 36,522 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 11,015 పాయింట్ల గరిష్ఠ స్థాయి;10,794 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
30 షేర్ల ఇండెక్స్‌లో హెచ్‌యూఎల్ మాత్రమే స్వల్పంగా లాభాన్ని గడించింది. మిగతా అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి.
ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధిక నష్టాన్ని మూటగట్టుకుంది. బజాజ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఎం&ఎం, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టాలను నమోదు చేశాయి.
ఆసియా మార్కెట్లు
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, సియోల్, హాంకాంగ్ సూచీలు గురువారం భారీగా నష్టపోయాయి.
రూపాయి, ముడి చమురు
కరెన్సీ మార్కెట్లో రూపాయి గురువారం 32 పైసలు తగ్గింది. దీనితో డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ఫ్లాట్‌గా రూ.73.89 వద్దకు చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.77 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 41.45 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:కరోనా అంతమైనా 'వర్క్ ఫ్రం హోం' సంప్రదాయం