LIC IPO For Policyholders: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్. త్వరలో రాబోయే ఎల్‌ఐసీ ఐపీఓలో పాలసీదారులకు డిస్కౌంట్ లభించనుంది. 5 శాతం మేర డిస్కౌంట్ అందించే అవకాశం ఉందని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. సెబీకి త్వరలో సమర్పించనున్న ముసాయిదా పత్రాల్లో ఈ వివరాలు ఉండనున్నాయి. అలాగే ఫిబ్రవరి 10న పత్రాలను సమర్పించే అవకాశం ఉందని తెలిపింది.
మార్చి నాటికి ఐపీఓకు తీసుకురావడంలో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ వారమే సెబీకి ముసాయిదను సమర్పించనున్నట్లు ఇప్పటికే దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. ఎల్‌ఐసీ ఎంబెడెడ్ విలువ రూ.5 లక్షల కోట్లు పైనే ఉంటుందని తెలిపిన ఆయన.. మార్కెట్ విలువ అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే పాలసీదారులకు 10 శాతం వాటాలను కేటాయించే అవకాశం ఉందని చెప్పారు. డిస్కౌంట్ కూడా ఇచ్చే ప్రతిపాదన ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ డిస్కౌంట్ 5 శాతం ఉండొచ్చని తెలుస్తోంది.
LIC IPO date 2022: మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని రూ.1.75 లక్షల కోట్ల నుంచి రూ.78వేల కోట్లకు కేంద్రం కుదించింది. ఇప్పటికే ఎయిరిండియా విక్రయం ద్వారా రూ.18 వేల కోట్లు రాబట్టిన ప్రభుత్వం.. మిగిలిన మొత్తాన్ని ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారీ విలువ కలిగిన ఎల్‌ఐసీలో కేవలం 5-7 శాతం వాటాలు విక్రయించడం ద్వారా ప్రభుత్వం తన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. దీంతో ఆ మేరకే షేర్లను జారీ చేస్తారని తెలుస్తోంది. సెబీకి సమర్పించే పత్రాల్లో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
ఇదీ చదవండి: ఎల్‌ఐసీ పాలసీదారులా..? ఐపీఓలో పాల్గొనాలంటే ఏం చేయాలి?