ముంబయి-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ బిడ్లను దక్కించుకున్నట్లు ఎల్ అండ్ టీ సంస్థ వెల్లడించింది. గుజరాత్ భూభాగంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపింది.
ఈ టెండర్లో భాగంగా గుజరాత్లో 237 కి.మీల రైలు మార్గాన్ని డిజైన్ చేసి నిర్మించాల్సి ఉంటుంది. వాపి, వడోదరా, సూరత్, బిల్లిమోరా నగరాల్లోని స్టేషన్లను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. 24 నదులు, 30 రహదారులకు అడ్డంగా బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మించాల్సి ఉంటుంది. టాటా ప్రాజెక్ట్స్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఆఫ్కాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి దిగ్గజ సంస్థలను తోసిరాజని ఈ ప్రాజెక్టును తన ఖాతాలో వేసుకుంది ఎల్ అండ్ టీ.
గడువులోగా పూర్తి చేస్తాం...
ఈ ప్రాజెక్టు ఆర్డర్ గెలుచుకోవడంపై సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆర్డర్ ప్రకారం నాలుగు సంవత్సరాల్లో పనులు పూర్తి చేయాలని చెప్పారు.
"చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, భారీ ప్రాజెక్టును ప్రభుత్వం నుంచి దక్కించుకున్నాం. ఈ 25 వేల కోట్ల ఆర్డర్.. ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద కాంట్రాక్టు. మా సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉంది. గడువులోగా పనులను పూర్తి చేస్తాం."
-ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఎల్ అండ్ టీ సీఈఓ, ఎండీ
గుజరాత్ భూభాగంలో ఉన్న రైలు ప్రాజెక్టు పనులు కాస్త వేగంగానే జరుగుతున్నప్పటికీ.. మహారాష్ట్రలో మాత్రం ఈ ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో భూసేకరణ కూడా ఇంకా పూర్తి కాలేదు.
ఇదీ చదవండి- నత్తనడకన సాగుతున్న భారత 'బుల్లెట్'
మరో ఏడు రూట్లలోనూ
జపాన్ సహకారంతో ముంబయి-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల పొడవైన బుల్లెట్ రైలు మార్గ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించింది. 2017లో అప్పటి జపాన్ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని మోదీ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. అందులో 81 శాతం సొమ్ము జపాన్ నుంచి రుణంగా అందనుంది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్ష, పరోక్షంగా 90 వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందని అధికారుల అంచనా. ముంబయి అహ్మదాబాద్‌తో పాటు మరో ఏడు రూట్లలోనూ హైస్పీడ్ బుల్లెట్ రైలు నిర్మాణానికి సాధ్యసాధ్యాలను పరిశీలిస్తోంది కేంద్రం.