జెట్ ఎయిర్వేస్ వ్యవహారంపై అత్యవసర సమావేశం నిర్వహించింది ప్రధానమంత్రి కార్యాలయం. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ సమస్యలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు సూచన మేరకు ప్రధానమంత్రి కార్యాలయ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలా ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశ వివరాల్ని ఖరోలా వెల్లడించారు. శుక్రవారం జెట్ ఎయిర్వేస్ 11 విమానాల్ని మాత్రమే నడిపిందని ప్రకటించారు. శని, ఆదివారాల్లో ఆరు నుంచి ఏడు విమానాల్ని మాత్రమే నడిపేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. జెట్ ఎయిర్వేస్ శుక్రవారం బ్యాంకర్లతో సమావేశమైంది. ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతల కన్సార్టియం ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ను నిర్వహిస్తోంది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఏ నిర్ణయమూ వెలువడలేదు.
అవసరమైన నిధుల కోసం సోమవారం జెట్ నిర్వాహకులు బ్యాంకర్లతో మళ్లీ సమావేశమౌతారు. అప్పటివరకూ కేవలం ఆరు నుంచి ఏడు విమానాలు మాత్రమే సేవలందిస్తాయి. అనంతర పరిణామాలు బ్యాంకర్లు తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.