అంతా అనుకున్నట్లు సాగి ఉంటే.. అలీబాబా సహ వ్యవస్థాపకుడు, యాంట్ గ్రూప్ అధినేత జాక్ మా గత ఏడాది ఈ సమయానికి ఆయన జీవితంలోనే అత్యంత అద్భుతమైన క్షణాల్ని ఆస్వాదిస్తుండేవారు. 37 బిలియన్ డాలర్ల సమీకరణే లక్ష్యంగా ఐపీఓకి సిద్ధమైన యాంట్ గ్రూప్ షేర్లు ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్‌లో నమోదై ఉండేవి. కట్ చేస్తే.. ప్రస్తుతం అత్యంత నిరాడంబరంగా జాక్ మా ఐరోపా పర్యటన కొనసాగిస్తున్నారు. పంట పొలాల్లో తిరుగుతూ ఆధునిక వ్యవసాయంపై అడిగి తెలుసుకుంటున్నారు. ఆంక్షల పేరిట చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సర్కార్ విరుచుకుపడడంతో ఆయన జీవితమే మారిపోయింది. కొన్ని నెలల పాటు అజ్ఞాతంలోనూ ఉండాల్సి వచ్చింది. అయితే, అంత అకస్మాత్తుగా ఆయనపై చైనా విరుచుకుపడడానికి ఓ బలమైన కారణమున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది..!
అనుమతి లేకుండానే కలుస్తారా?
2016-2017 సమయంలో జాక్ మాకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత ఆదరణ లభించింది. ఆ సమయంలో ఆయన అనేక మంది దేశాధినేతలు, పెద్ద పెద్ద కంపెనీల అధినేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన 2017లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. అమెరికాలో పది లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. అయితే, ఈ సమావేశానికి ఆయన బీజింగ్ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని సమాచారం. ఇది చైనాకు ఏమాత్రం రుచించలేదు. ఈ విషయాన్ని జిన్‌పింగ్ బృందం అప్పట్లోనే జాక్ మాకు తెలియజేసిందట!
పైగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికావాసులు ఉద్యోగాలు కోల్పోవడానికి చైనాయే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో ఇరు దేశాల సంబంధాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. సరిగ్గా ఈ తరుణంలో ట్రంప్‌ను జాక్ మా కలవడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. ఈ సంఘటనతో జాక్ మాపై జిన్‌పింగ్ దృష్టిసారించారని.. దాని ఫలితమే తదనంతర కాలంలో ఆంక్షల రూపంలో బయటకు వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నోరు జారిన 'మా'..!
గతేడాది అక్టోబరు 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని హితవు పలికారు. ఇంకేముంది.. జాక్ మా వ్యాఖ్యలపై మండిపడ్డ డ్రాగన్.. ఆయనపై ప్రతీకార చర్యలకు దిగింది. ఆయన వ్యాపార సామ్రాజ్యంపై నియంత్రణ సంస్థలతో నిఘా పెట్టింది. యాంట్ ఫైనాన్షియల్ ఐపీవోను అడ్డుకొంది. అక్రమ వ్యాపార పద్ధతులను అనుసరించారంటూ గత ఏడాది ఏప్రిల్‌లో 2.75 బిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించింది. అక్కడ మొదలైన జిన్‌పింగ్ ఆంక్షల పర్వం ప్రైవేటు రంగంపై క్రమంగా కొనసాగుతూ వచ్చింది. టెక్నాలజీ, స్థిరాస్తి, గేమింగ్, విద్య, క్రిప్టోకరెన్సీ.. ఇలా విస్తరిస్తూ పోతోంది. జిన్‌పింగ్ సర్కార్ లక్ష్యాలకు అడ్డంకిగా మారే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే జాక్ మాపై విరుచుకుపడ్డట్లు సంబంధిత విశ్లేషకుల అంచనా! అయితే, ప్రైవేటు రంగంలో బలంగా మారుతున్న వ్యాపారవేత్తలంతా మున్ముందు ముప్పుగా మారే అవకాశం ఉందన్న అనుమానాలతోనే అందరిపై ఆంక్షల కొరడా ఝుళిపించినట్లు తెలుస్తోంది.
జీవితం తలకిందులు..
చైనా ఆంక్షల తర్వాత జాక్ మా జీవితంలో చాలా మార్పొచ్చినట్లు సమాచారం. యాంట్ గ్రూప్ లిస్టింగ్‌కు సంబంధించి తన ప్రణాళికలను జిన్‌పింగ్ సన్నిహితులకు వివరించేందుకు ప్రభుత్వాన్ని కోరారట! కానీ, అందుకు అంగీకారం లభించలేదని సమాచారం. దీంతో ఈ ఏడాది జాక్ మా నేరుగా జిన్‌పింగ్‌కే లేఖ రాశారట. ఇకపై తన జీవితం మొత్తాన్ని చైనాలో గ్రామీణ విద్యాభివృద్ధి కోసమే అంకితం చేస్తానని తెలిపారట. ఈ విషయాన్ని జిన్‌పింగ్ పార్టీ అంతర్గత సమావేశంలో ప్రస్తావించారని సమాచారం. అలా జాక్ మా వ్యవసాయం, విద్యపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతుల అమలు, పరిశోధనలకు సంబంధించి అధ్యయనం కోసం ప్రస్తుతం ఆయన ఐరోపా పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవీ చదవండి: