కరోనా వైరస్ సంక్షోభం కారణంగా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ పుంజుకోవడానికి కొన్నేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్స్ (ఎస్‌అండ్‌పీ) అభిప్రాయపడింది. రుణాల పునర్‌వ్యవస్థీకరణతో నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) గుర్తించడం వాయిదా పడొచ్చేమో కానీ, ఎన్‌పీఏల సమస్య పరిష్కారం కాదని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రుణాల పునర్‌వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తోందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ పైవిధమైన వ్యాఖ్యలు చేసింది. కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభ పరిణామాల ప్రభావం గతంలో అంచనా వేసిన దాని కంటే కూడా బ్యాంకులపై చాలా కాలం పాటు కొనసాగొచ్చని తెలిపింది. 2019-20లో 8.5 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 2020-21లో 14 శాతానికి పెరగొచ్చని ఎస్‌అండ్‌పీ అంచనా వేసింది. 'కొవిడ్-19 ప్రభావం వల్ల భారత బ్యాంకింగ్ రంగం పుంజుకోవడానికి ఏళ్లు పట్టే అవకాశం ఉంది. రుణాల మంజూరు నెమ్మదించి తద్వారా ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ఈ పరిణామం దారితీస్తుంద'ని తెలిపింది.
లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో రుణాల ఈఎంఐలపై ఆరు నెలల పాటు మారటోరియం సదుపాయాన్ని ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీని తర్వాత కొన్ని జాగ్రత్తలతో రుణాల పునర్‌వ్యవస్థీకరణకు వీలు కల్పించే ఉద్దేశంలో ఆర్‌బీఐ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎస్‌అండ్‌పీ స్పందిస్తూ.. ఈ నిర్ణయం వల్ల సమస్య పరిష్కారం కాదని, కొన్నేళ్లక్రితం జరిగినట్లుగా నిరర్థక ఆస్తుల గుర్తించడం మాత్రమే ఆగిపోతుందని తెలిపింది. రుణాల పునర్‌వ్యవస్థీకరించడం వల్ల ఆస్తుల నాణ్యతపై ఆర్‌బీఐ సమీక్ష నిర్వహించాల్సి వచ్చిన విషయాన్ని ఎస్‌అండ్‌పీ గుర్తుచేసింది. రుణాలను పునర్‌వ్యవస్థీకరిస్తే బ్యాంకులపై వ్యయ భారం కూడా పెరుగుతుందని తెలిపింది. మొండి బకాయిల వసూళ్లు బాగా పడిపోవడమే కాకుండా ఇవి మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. బ్యాంకులతో పోలిస్తే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రంగాల విషయానికొస్తే... స్థిరాస్తి, టెలికాం, విద్యుత్ రంగాల్లో మొండి బకాయిలు పెరగడం కొనసాగొచ్చని తెలిపింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రుణాల చెల్లింపులపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ప్రకటించిన రుణ హామీ పథకం వీటికి కొంత మేలు చేయొచ్చని వివరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.40,000 కోట్ల వరకు మూలధన సహాయం అవసరం అవుతుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది.