కొవిడ్-19 రెండో దశ విజృంభణ నేపథ్యంలో, ఐటీ పరిశ్రమ తమ ఉద్యోగులకు సాధ్యమైనంత తొందరగా టీకాలు వేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల వారు కార్యాలయాలకు వచ్చేందుకు వీలవుతుందని భావిస్తోంది. ఎక్కడినుంచైనా పని మరికొంత కాలం తప్పనిసరి కావడంతో, సంస్థలు అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటున్నాయి. 18 ఏళ్లు నిండిన వారందరికీ మే 1 నుంచి టీకాలు అందుబాటులో ఉంటాయన్న ప్రభుత్వ ప్రకటన ఐటీ వర్గాలకు ఎంతో ఊరట కలిగిస్తోంది. ఐటీ ఉద్యోగుల సగటు వయసు 30 ఏళ్ల లోపు ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఐటీ నిపుణులందరికీ టీకా వేసే అవకాశం లభిస్తుందని ఐటీ సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగులకు టీకా వేయించేందుకు కంపెనీలు, ఐటీ పార్కుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు, ఆసుపత్రులతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రభావం తక్కువే
కరోనా తొలి దశలో ఐటీ పరిశ్రమకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. ప్రస్తుత రెండో దశ ఈ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించడం లేదు. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడటమే ఇందుకు కారణం. కొత్త ప్రాజెక్టులు పూర్తి చేయడంలోనూ ఇబ్బందులు ఎదురుకాలేదని ఐటీ సంస్థల ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుత తీరులోనే మరికొంతకాలం కొనసాగినా ఇబ్బందేమీ ఉండదని భావిస్తున్నారు.
ఏడాది చివరి కల్లా
ప్రస్తుతం ఐటీ కార్యాలయాలకు వచ్చి పని చేస్తున్నవారు 10 శాతానికి మించడం లేదు. తప్పనిసరిగా ఆఫీసుకు రావాల్సిన వారే వీరిలో ఉంటున్నారు. హైదరాబాద్ సహా తెలంగాణాలో రాత్రివేళ కర్ఫ్యూ విధించినా, ఐటీ విధులను అత్యవసర సర్వీసుల్లో చేర్చడం వల్ల రాకపోకలకు అంతరాయం ఉండదు. మామూలుగా అయితే ఈ ఏడాది జులై నాటికి 30% మంది కార్యాలయాలకు వచ్చి పనిచేస్తారని సంస్థలు భావించాయి. కానీ, కరోనా రెండో దశతో ఇది ఇప్పుడే సాధ్యం కాకపోవచ్చు. టీకాలు వేయిస్తే.. డిసెంబరు నాటికి 70% మంది కార్యాలయాలకు వచ్చి పని చేస్తారని అంచనా వేస్తున్నాయి.
నియామకాలు ఆగలేదు
కరోనా ప్రభావం నుంచి ఐటీ రంగం ఊహించినదానికన్నా వేగంగా కోలుకుంది. దీంతో ప్రాంగణ నియామకాలపై ప్రతికూల ప్రభావం పడలేదు. 2020-21లో రెండుమూడు పెద్ద సంస్థలు దాదాపు 45 వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. 2021-22లో ఈ నియామకాల్లో 10-15శాతం వృద్ధి కనిపిస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పనితీరు బాగుంది
"ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ పనితీరు బాగుంది. హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులందరికీ టీకాలు వేయించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఇప్పటికే కొన్ని సంస్థలు అర్హులైన తమ ఉద్యోగులు టీకాలు వేయించుకునేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించాయి. తొలి దశలో ఉద్యోగులు, ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు టీకాలను వేయించేందుకు హైసియా కృషి చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీ పరిశ్రమ వృద్ధి, నియామకాలు సానుకూలంగానే ఉంటాయని ఆశిస్తున్నాం."
- భరణి కె అరోల్,ప్రెసిడెంట్, హైసియా
ఇవీ చదవండి: కొవిడ్ రెండో దశ ప్రభావం తాత్కాలికమే!