కొత్త సంవత్సరం వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ బహుమతి అందించింది. రైల్వే టికెట్లు బుకింగ్‌కు ఉపయోగించే ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌ను సరికొత్త ఫీచర్లతో ఆధునికీకరించింది. యూజర్లు మరింత సులువుగా టికెట్లను బుక్ చేసుకునేందుకు కొత్త ఫీచర్లను జోడించింది. కొత్త వెబ్‌సైట్, యాప్‌ను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రారంభించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన సదుపాయలివీ..
- ఇంతకుముందు టికెట్ బుక్ చేసేటప్పుడు స్టేషన్ల వివరాలు ఎంటర్ చేయగానే కేవలం రైలు పేరు మాత్రమే కనిపించేది. దానిపై క్లిక్ చేశాక తరగతిని బట్టి టికెట్ల అందుబాటు, ధరలు వంటి వివరాలు కనిపించేవి. అప్‌డేట్ చేసిన వెర్షన్‌లో ప్రయాణ వివరాలను సెర్చ్ చేయగానే రైళ్లు, ఆయా తరగతుల్లో అందుబాటులో ఉన్న సీట్లు, ధరలు వెంటనే ప్రత్యక్షమవుతాయి. టికెట్ కన్ఫర్మేషన్‌కు ఉన్న అవకాశాలను కూడా అక్కడే శాతాల రూపంలో చూపిస్తుంది.సరికొత్తగా ఐఆర్‌సీటీసీ అప్‌డేట్ వెబ్‌సైట్
- మీరు బయల్దేరాల్సిన స్టేషన్, చేరాల్సిన స్టేషన్ వివరాలు నింపే విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)ను కొత్త వెర్షన్‌లో ప్రవేశపెట్టారు. దీని వల్ల మీరు మొదటి రెండు మూడు అక్షరాలు ఎంటర్ చేయగానే ఆ స్టేషన్‌తో పాటు మీరు వెళ్లాల్సిన స్టేషన్ వివరాలు కూడా సూచిస్తుంది. దీని కోసం రైల్వే శాఖ ఏఐను వాడుకుంటోంది. దీని వల్ల స్టేషన్ పూర్తి పేరు ఎంటర్ చేయకుండానే స్టేషన్ వివరాలను నింపొచ్చు. రెగ్యులర్, ఫేవరెట్ జర్నీ వివరాలు (వాటిని మీరు ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది) ఆటోమేటిక్‌గా అక్కడ ప్రత్యక్షమవుతాయి. అలాగే యూజర్ జర్నీ క్లాస్, ప్రయాణానికి అనువైన సమయం, ట్రైన్ టైప్ (స్పెషల్, స్పెషల్ తత్కాల్) వంటివి టిక్ పెట్టి కావాల్సిన రైలును సెర్చ్ చేసుకోవచ్చు.
- ఇంతకుముందు సీట్లు అందుబాటులో (ఎవైలబిలిటీ) ఉన్నాయనుకుని బుక్ చేసేలోపు ‘టికెట్లు అయిపోయాయ’నే సందేశం కనిపించేది. దీంతో యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. టికెట్ బుక్ అయ్యాక వెయిటింగ్ లిస్ట్ అనే స్టేటస్ కనిపించేది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఇలా ఎక్కువగా జరిగేది. తాజాగా అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌లో ‘క్యాచీ సిస్టమ్’ను జోడించారు. దీని వల్ల ఎప్పటికప్పుడు ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో వెంట వెంటనే చూపిస్తుంది. అంటే పేజీ రిఫ్రెష్/రీలోడ్ చేయకుండానే ఎవైలబిలిటీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
- ఇంతకుముందు ఒక తేదీని దృష్టిలో ఉంచుకుని స్టేషన్ వివరాలు నింపేవాళ్లం. ఒకవేళ ఆ తేదీల్లో రైళ్లు అందుబాటులో లేకపోయినప్పుడు వేరే తేదీకి వెళ్లాలంటే మళ్లీ వెనక్కి వెళ్లాల్సి వచ్చేది. కొత్తగా తీసుకొచ్చిన వెర్షన్‌లో బుక్‌నౌ ఆప్షన్ పక్కనే ఇతర తేదీల్లో రైళ్ల అందుబాటును చూసుకోవచ్చు.
- పాత వెర్షన్‌లో టికెట్ ఒకసారి బుక్ చేసుకుని పేమెంట్ పేజీలోకి వెళ్లాక, ప్రయాణ తేదీ, పేర్లు లాంటి వివరాల్లో ఏవైనా తప్పులు ఉన్నా తెలిసేది కాదు. కొత్త వెర్షన్‌లో పేమెంట్ పేజీలో ప్రివ్యూ చూసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో తప్పులకు ఆస్కారం తక్కువగా ఉంటుంది. అలాగే రిఫండ్‌కు సంబంధించిన వివరాలనూ హోం పేజీలోనే కేటాయించారు.
- కొత్త వెర్షన్‌లో సైబర్ సెక్యూరిటీకి పెద్ద పీట వేశారు. అలాగే, గతంలో టికెట్ బుక్ చేసినప్పుడు వినియోగించిన డెబిట్/ క్రెడిట్ కార్డు వివరాలను మీ సమ్మతితో వెబ్‌సైట్ సేవ్ చేసుకుంటుంది. పేమెంట్స్ చేసే సమయంలో వాటిని వాడుకోవచ్చు. అయితే సీవీవీ నెంబరు లాంటి వివరాలు సేవ్‌లో ఉండవనే విషయం తెలిసిందే.
- ఐఆర్‌సీటీసికి 6 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండగా.. రోజులో 8 లక్షల టికెట్లు బుక్ అవుతుంటాయి. రైల్వేలో బుక్ అయ్యే టికెట్లలో 83 శాతం వాటా ఆన్‌లైన్‌దే. కాగా, ఆధునికీకరించిన వెర్షన్‌లో ఒకేసారి 5 లక్షల మంది యూజర్లు ఐఆర్‌సీటీసీని ఉపయోగించినా ఎలాంటి ఇబ్బందీ ఉండదని రైల్వే శాఖ చెబుతోంది.
ఇదీ చదవండి: మానవత్వానికి నిలువెత్తు ప్రతీక ఆ వడ్డీ వ్యాపారి