IOB CBI Privatisation: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగరవేసిన నేపథ్యంలో భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణల ప్రణాళికను వేగవంతం చేయాలని భావిస్తోంది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌బీ)లను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఇందుకు వీలు కల్పించేలా.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు వర్తించే 'విదేశీ పెట్టుబడుల పరిమితి అయిన 20 శాతాన్ని' తొలగించేందుకు, ఆయా బ్యాంకుల్లోని ఉద్యోగులకు మరింత ఆకర్షణీయ స్వచ్ఛంద పదవీ విరమణ పథకాని(వీఆర్‌ఎస్)కి మంత్రిమండలి ఆమోదాన్ని ఆర్థిక శాఖ కోరనుందని సమాచారం. కేంద్రం ప్రైవేటీకరించాలనుకుంటోంది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ)లేనని ఒక అధికారి పేర్కొన్నారు. "ఈ రెండు బ్యాంకుల్లో ఎంత మేర వాటా విక్రయించాలన్నది పెట్టుబడుదార్ల నుంచి వచ్చే ఆసక్తి, మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. కొన్నేళ్లపాటు ప్రభుత్వం కనీసం 26 శాతం వాటాను అట్టేపెట్టిఉంచుకోవచ్చు" అని ఆ అధికారి వివరించారు.
చట్టాల్లో సవరణ అవసరం
ప్రస్తుత బ్యాంకింగ్ కంపెనీల (ఆస్తుల కొనుగోళ్లు-బదిలీ) చట్టాల ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 20 శాతం వరకే విదేశీ పెట్టుబడులకు అనుమతి ఉంది. ఈ పరిమితిని పెంచితేనే విదేశీ మదుపర్లను ఈ బ్యాంకులు ఆకర్షించే వీలుంటుంది. ఇందు కోసం బ్యాంకింగ్ కంపెనీల చట్టాలతో పాటు మరికొన్ని చట్టాలను సవరించాల్సి ఉంటుంది. 2021 బడ్జెట్ ప్రసంగంలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. 'ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ, బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు-2021'ను మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోకపోతే ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన మొత్తం 9.5 లక్షల మంది సిబ్బంది అందరూ ఈనెల 28, 29 తేదీల్లో సమ్మె చేస్తారని అఖిల భారత కేంద్ర బ్యాంకుల ఉద్యోగుల సమాఖ్య ఇటీవలే హెచ్చరించారు.
ఇదీ చూడండి: ప్రతిధ్వని: బ్యాంకుల ప్రైవేటీకరణతో ప్రభుత్వం ఆశిస్తున్నదేంటి...?