ETV Bharat / business

బీమా క్లెయిం వేళలో చిక్కులా? ఇలా జాగ్రత్త పడండి - బీమా పాలసీ

Insurance claim: మనందరికీ కొన్ని బాధ్యతలు ఉంటాయి. అందులో కొన్ని ఆర్థికంగా ఉంటాయి. అనుకోని పరిస్థితులు ఎదురైనా ఈ ఆర్థిక బాధ్యతలను నెరవేర్చేందుకు ఇబ్బందులు ఎదురుకాకూడదు. అందుకే, ఆర్జించే వ్యక్తులు బీమా పాలసీ తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. అయితే, బీమా తీసుకోవడంతోనే సరిపోదు. దాన్ని క్లెయిం చేసుకోవాల్సిన కష్టకాలంలో ఎలాంటి చిక్కులు ఎదురవ్వకుండా పాలసీ తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి.

insurance claim process
బీమా క్లెయిం వేళలో చిక్కులా? ఇలా జాగ్రత్త పడండి
author img

By

Published : Dec 3, 2021, 11:48 AM IST

పాలసీదారుడు.. బీమా సంస్థ మధ్య కుదిరే ఒక నమ్మకమైన ఒప్పందమే బీమా పాలసీ. అందుకే, అటు బీమా సంస్థ.. ఇటు పాలసీదారుడు అన్ని విషయాల్లోనూ పారదర్శకంగా ఉండాలి. అప్పుడే దీర్ఘకాలం భరోసా కొనసాగుతుంది. మోసపూరిత సమాచారం ఇచ్చినప్పుడు ఆ పాలసీ రద్దు కావడమే కాకుండా.. క్లెయిం చెల్లింపును తిరస్కరించే ప్రమాదమూ ఉంది.

అర్థం చేసుకోవాలి..

పాలసీ రకాన్ని బట్టి, మరణం, తీవ్ర వ్యాధులు సోకినప్పుడు, ప్రమాదాలు, వ్యవధి తీరినప్పుడు.. ఇలా పలు సందర్భాల్లో పాలసీని క్లెయిం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. మనం తీసుకునే పాలసీ రకం ఏమిటి? ఎప్పుడు పరిహారం చెల్లిస్తుంది? అనే అంశాలను ముందుగా అర్థం చేసుకోవాలి. క్లెయిం లావాదేవీ సవ్యంగా జరగాలంటే.. మీ బ్యాంకు ఖాతా వివరాలు ఎప్పటికప్పుడు బీమా సంస్థకు తెలియజేస్తూ ఉండాలి. ప్రీమియాలు అన్నీ చెల్లించాలి. ఇచ్చిన సమాచారంలో ఎలాంటి వివాదాలూ ఉండొద్దు. అప్పుడే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పాలసీ క్లెయిం చెల్లింపు జరుగుతుంది.

పారదర్శకంగా..

జీవిత పాలసీ తీసుకోవడం వెనక ప్రధాన లక్ష్యం కష్టకాలంలో పరిహారం పొందడం. అందుకే, పాలసీ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ప్రతి సమాచారం కచ్చితంగా, స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే.. పాలసీ వ్యవధి తీరిన తర్వాత చెల్లింపులు లేదా పాలసీదారుడు మరణించిన సందర్భంలో సులభంగా పరిహారం పొందేందుకు వీలవుతుంది. పాలసీదారుడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే పాలసీని అందుతుంది. ఒక వ్యక్తి ఆదాయం, అతని వయసు, ఇతర అంశాలను లెక్కలోకి తీసుకొని పాలసీని ఇస్తుంది బీమా సంస్థ. పాలసీదారుడు తన గురించి తప్పు వివరాలు తెలియజేసినప్పుడు.. తీరా క్లెయిం సందర్భంలో విచారణలో వివరాలు తప్పు అని తేలితే బీమా సంస్థ పరిహారం ఇవ్వడానికి తిరస్కరించే ఆస్కారం ఉంది.

ఆరోగ్య చరిత్ర..

బీమా పాలసీ ఇచ్చేటప్పుడు పాలసీదారుడు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని బీమా సంస్థలు నిశితంగా పరిశీలిస్తాయి. ఆరోగ్య చరిత్ర, జీవన శైలి అలవాట్లు, వృత్తి తదితర అంశాల్లో ఎలాంటి దాపరికం పనికిరాదు. నిర్ణీత వ్యాధులు ఉన్నప్పుడు బీమా పాలసీ ఇవ్వకపోవచ్చు. ఇలాంటిది తప్పించుకునేందుకు.. ఆ వివరాలు దాచిపెట్టి పాలసీ తీసుకున్నా.. తర్వాత తెలిసినప్పుడు పాలసీని రద్దు చేసే హక్కు బీమా సంస్థకు ఉంటుంది. ముఖ్యంగా ధూమపానం అలవాటు ఉన్నవారు.. ఆ విషయాన్ని కచ్చితంగా తెలియజేయాల్సిందే. దీనివల్ల కాస్త అధిక ప్రీమియం వసూలు చేయొచ్చు. కానీ, భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. కొవిడ్‌-19 బారిన పడి, కోలుకున్న వారికీ 90 రోజుల వరకూ బీమా ఇవ్వడం లేదు. రెండు డోసుల టీకా వేసుకున్న వారికి బీమా ప్రీమియంలో కాస్త రాయితీని ఇస్తున్నాయి కొన్ని బీమా సంస్థలు.

ఇప్పటికే పాలసీ ఉంటే..

ప్రతి వ్యక్తికీ ఒక విలువ ఉంటుంది. బీమా సంస్థలు దీని ఆధారంగానే పాలసీ మొత్తాన్ని నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి వార్షిక వేతనం రూ.20లక్షలు అనుకుందాం. ఒక బీమా సంస్థ వార్షిక వేతనానికి 10 రెట్ల వరకూ బీమా ఇస్తుంది అంటే.. అతను రూ.2కోట్ల బీమా పొందేందుకు అర్హుడు. ఈ పాలసీ తీసుకున్న తర్వాత.. సంస్థ విచారణలో ఆదాయం కేవలం రూ.10లక్షలే అని తేలింది అనుకోండి.. ఈ పాలసీకి పరిహారం ఇచ్చేందుకు బీమా సంస్థ అంగీకరించకపోవచ్చు. ఇప్పుడున్న ఆదాయం, వయసు, భవిష్యత్తులో ఆర్జించే మొత్తం.. ఇలా పలు అంశాల ఆధారంగా బీమా పాలసీ వస్తుంది. ఇప్పటికే ఏదైనా పాలసీ తీసుకొని ఉంటే.. ఆ వివరాలనూ తప్పనిసరిగా తెలియజేయాలి.

మారితే.. తెలియజేయండి..

పాలసీ తీసుకున్నప్పుడు ఉన్న ఫోన్‌ నెంబరు, ఇ-మెయిల్‌, ఇంటి చిరునామాలాంటివి మారితే.. ఆ వివరాలను బీమా సంస్థకు తెలియజేయాలి. ఇప్పుడు చాలామంది ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకుంటున్నారు. పాలసీ పత్రాలన్నీ ఇ-మెయిల్‌లోనే ఉండిపోతాయి. అవసరమైనప్పుడు ఈ వివరాలు తెలియక.. చాలా పాలసీలు క్లెయిం చేసుకోలేకపోతున్నారని బీమా సంస్థలే చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితి రాకూడదంటే.. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకున్నా.. ఆ పత్రాలను ప్రింట్‌ తీసుకొని, భద్రపర్చుకోవాలి. ప్రీమియం చెల్లించిన ప్రతి రశీదునూ వాటికి జత చేయాలి. అప్పుడే అనుకోని కష్టంలో బీమా పాలసీ కొండంత భరోసానిస్తుంది.

నామినీ ఉండేలా...

అనుకోని పరిస్థితుల్లో పాలసీని ఎవరు క్లెయిం చేసుకుంటారు అని తెలిపేందుకు పాలసీలో నామినీని తప్పనిసరిగా పేర్కొనాలి. చాలామంది ఇప్పటికీ నామినీ వివరాలు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. మీ పాలసీలో నామినీ పేరు సరిగా ఉందా లేదా చూసుకోండి. ఆధార్‌, పాన్‌ కార్డులాంటి వాటిపై ఉన్న పేరు, పుట్టిన తేదీ వివరాలతో సరిపోవాలి. బ్యాంకు ఖాతా వివరాలు మారినప్పుడు ఆ వివరాలనూ బీమా సంస్థకు తెలియజేయాలి. క్లెయిం వేళలో.. బీమా సంస్థలు నామినీని కొన్ని ప్రశ్నలు, గుర్తింపు ధ్రువీకరణ వివరాలను కోరుతుంటాయి. మోసపూరిత వ్యక్తుల చేతుల్లోకి పరిహారం వెళ్లకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటాయి. క్లెయిం సమాచార పత్రం, మరణ ధ్రువీకరణ, కేవైసీ పత్రాలు, బ్యాంకు వివరాల్లాంటివి బీమా సంస్థకు సమర్పించాలి.

ఇదీ చూడండి:- ఆరోగ్య బీమా పాలసీలో ఈ రైడర్లు ఉంటే మేలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.