ఓటీటీ ఫ్లాట్‌ఫాంలలో భారతీయులు 188 బిలియన్ నిమిషాలు గడిపినట్లు 'రెడ్‌సీర్' నివేదిక తెలిపింది. ఒక్క ఫిబ్రవరిలోనే 31 బిలియన్ నిమిషాల పాటు సినిమాలు చూసినట్లు పేర్కొంది. స్మార్ట్ఫోన్లతో ఓటీటీ సబ్స్క్రిప్షన్లు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. ఓ నెలలో గరిష్ఠంగా 69 బిలియన్ నిమిషాల వీక్షణలు నమోదైనట్లు పేర్కొంది.
రెడ్‌సీర్ నివేదికలో ఆసక్తికర అంశాలు..
- ఎక్కువ మంది చూసిన యాప్ వూట్
- సినిమాలు ఎక్కువగా చూసిన యాప్ హాట్‌స్టార్(33 శాతం)
- టెలికాం ఆపరేటర్లు, బ్రాడ్ బ్యాండ్ కంపెనీలు ఇచ్చిన ఆఫర్లతో చందాదారులు మరింత పెరిగారు.
- వార్షిక చందాలపై ఆఫర్లు ఇవ్వడం కారణంగా చందాదారుల సంఖ్య అమాంతం పెరిగింది.
- గతేడాదితో పోల్చితే ఎక్కువ మంది చందాదారులు కొత్త కంటెంట్‌ను కోరుకుంటున్నారు.
"వినియోగదారులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో పలు చిత్రనిర్మాణ సంస్థలు కూడా ఆన్లైన్లో కంటెంట్ ఇవ్వడానికి ఇష్టపడ్డాయి. వీటితో పాటు సంబంధిత సంస్థలు కూడా పలు చిత్రాలను నిర్మించాయి. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలకు డిమాండ్ పెరిగింది."
-నిఖిల్ దలాల్, ఉజ్జ్వల్ చౌధూరీ, రెడ్‌సీర్
మారిన అభిరుచి..
గత ఏప్రిల్‌తో పోలిస్తే.. ఫిబ్రవరిలో వీక్షణా సమయం ఆరు శాతం తగ్గింది. ఎందుకంటే ఆంక్షల సడలింపుతో సాధారణ స్థితి ప్రారంభమైన వేళ.. ప్రేక్షకుల అభిమాన టీవీ షోలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో రిలీజయ్యే కంటెంట్ విస్తృతి పెరిగిన నేపథ్యంలో.. వీటికి వీక్షణలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
గత సంవత్సర కాలంలో వినియోగదారుల అభిరుచి చాలావరకు మారిపోయింది. సరికొత్త షోలు, భిన్నమైన కంటెంట్ కోసం ఓటీటీలపై ఆధారపడుతున్నారు.
స్మార్ట్ టీవీ వినియోగదారులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో డిస్నీ+హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, హోయిచోయ్, సన్‌నెక్ట్స్ వంటి ఓటీటీ ఛానళ్లు ప్రాంతీయంగా మరిన్ని భాషల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇది పరిశ్రమ వృద్ధిని వేగవంతం చేస్తుందని నివేదిక తెలిపింది.
ఇవీ చదవండి: 'ఓటీటీల నియంత్రణ' పిటిషన్లపై సుప్రీం స్టే
ఓటీటీల నియంత్రణపై కేంద్రం అఫిడవిట్